AVATAR:Fire & Ash : అధ్బుత ప్రపంచం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ : లైట్ స్తోమ్మ్ ఎంటర్టైన్మెంట్,
పంపిణిదారులు : ట్వంటీయత్ సెంచరీ స్టూడియోస్,
నటీనటులు: సామ్ వర్తింగ్డన్, జో సల్దానా, సిజర్నీ వీవర్, స్టీఫాన్ లాంగ్, కేట్ విన్స్లెట్, ఊనా చాప్లిన్ తదితరులు
మ్యూజిక్: సైమన్ ఫ్రాంగ్లెన్, సినిమాటోగ్రఫి: రస్సెల్ కార్పెంటర్
ఎడిటింగ్: స్టీఫెన్ రివికిన్, డెవిడ్ బ్రెన్నెర్, జాన్ రిఫ్యూ, జేమ్స్ కామెరాన్
నిర్మాతలు: జేమ్స్ కామెరాన్, జాన్ లండావు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : జేమ్స్ కామెరాన్
విడుదల తేది : 19.12.2025
నిడివి : 3 ఘంటల 17 నిముషాలు
ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్, 400 మిలియన్ల డాల్లర్ల భారీ వ్యయంతో తెరకెక్కించిన విజువల్ వండర్ అవతార్: ఫైర్ అండ్ యాష్ చిత్రం ఈ రోజు వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేస్తుంది. అవతార్ ప్రాంచైజీపై అభిమానులలో ఇప్పటికే కనీవినీ ఎరుగని అంచనాలు ఏర్పడ్డాయి. అవతార్ మొదటి భాగం సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన అవతార్ 2 ప్రపంచ వ్యాప్తంగా 2 బిలియన్ డాలర్లు వసూలు చేసి బాక్సాఫీస్ ప్రభంజనం సృష్టించింది. ప్రపంచంలో ఈ సినిమా సృష్టించిన సంచలనం గురించి రాయాలి అంటే ఒక బుక్ సరిపోదు.. పెద్ద గ్రంథమే కావాలి. ఈ సినిమా 2009లోనే దాదాపు 12 వేల కోట్లకు పైగా వసూలు చేసింది. మూడేళ్ల కింద సీక్వెల్ చేశాడు జేమ్స్. ఇప్పుడు అవతార్: 3 వచ్చింది. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా లేదా సమీక్షలో చూద్దాం!
కథ:
ముందు నుంచి అవతార్ అంటేనే మనకు గుర్తొచ్చేది పండోరా గ్రహం. అక్కడే నుండే కథ రాసుకుంటున్నాడు జేమ్స్ కెమెరూన్. అవతార్ 2లో సముద్ర గర్భాన్ని చూపించిన ఈయన.. ఈసారి కథను నిప్పు దగ్గరికి వచ్చాడు. జేక్ సల్లీ కుటుంబం సెకండ్ పార్ట్ మొత్తం నీళ్లలో నివసించే వాళ్లతో కొట్లాడుతూ ఉంటారు.. తమ తెగ కోసం హీరో పోరాడుతూ ఉంటాడు. జేక్ సల్లీ (సామ్ వర్తింగ్టన్), నేతిరి (జో సల్దానా) దంపతులు తమ కుమారుడు నెతేయమ్ మరణంతో తీవ్రమైన విషాదంలో కూరుకుపోతారు. ఈ నేపథ్యంలో వారు మాత్రం హ్యుమన్ కాలనీలపై ఎదురు దాడికి సిద్దమవుతారు. ఇక్కడికి వచ్చేసరికి పండోరలోని అగ్నిపర్వత ప్రాంతాల్లో నివసించే యాష్ పీపుల్ అనే కొత్త తెగను ఎదుర్కోవాల్సి వస్తుంది. నేవి తెగ యుద్ధ వ్యూహాన్ని మరింత ఉధృతంగా ప్లాన్ చేస్తారు. ఆ సమయంలోనే నేవి తెగపై మానవులతో కలిసి మాంగ్క్వాన్ అనే తెగకు చెందిన యాష్ పీపుల్ దాడికి దిగుతారు. యాష్ తెగకు వారంగ్ (ఊనా చాప్లిన్) నాయకత్వంలో నేవి తెగపై దండెత్తుతారు.కుమారుడి మరణంతో జేక్, నేతిరి ఎలాంటి భావోద్వేగాలకు గురయ్యారు? తదుపరి యుద్ద ప్రణాళికలో వారి వ్యూహాన్ని ఎలా కొనసాగించాలని అనుకొన్నారు? వారంగ్ నాయకత్వంలో మంగ్‌క్వాన్ తెగ ఎలాంటి వ్యూహాలను రచించింది. నేవి, మంగ్‌క్వాన్ తెగ మధ్య పోరు ఎలా సాగింది? వారంగ్ లీడర్షిప్ను జేక్, నేతిరి ఎలా ఎదురించారు? క్రూరంగా ఉండే ఈ కొత్త తెగతో జేక్ కుటుంబానికి వచ్చిన ముప్పు ఏంటి..? పండోరా ప్రపంచంలో సవాల్ ఎదురైన నేవి తెగకు ఎలాంటి ఫలితం లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే అవతార్3 సినిమా కథ.
విశ్లేషణ :
నిజం చెప్పాలంటే పదహారేళ్ల కింద వచ్చిన అవతార్ సినిమా చూసినప్పుడు ప్రపంచ సినిమా మొత్తం మైమరిచిపోయింది. అలాంటి సినిమా ఎలా తీయగలిగాడు అంటూ మొత్తం ప్రపంచమే జేమ్స్ కెమెరూన్ గురించి మాట్లాడుకుంది. ఆ సినిమా క్లైమాక్స్‌లో గానీ, ఆ ప్రపంచాన్ని పరిచయం చేసినప్పుడు వున్నా థ్రిల్ జేమ్స్ సీక్వెల్స్‌లో దొరకడం లేదు అనిపించింది. ఆల్రెడీ మూడేళ్ల కింద వచ్చుగా అవతార్ 2లో కథనం నెమ్మదించిందని విమర్శలు వచ్చాయి. ఈ మూడవ భాగంలోనూ అదే సమస్య కనిపిస్తుంది. కథ, కథనం సినిమాకు ప్రధాన బలహీనతలుగా మారాయి. చూసిన సన్నివేశలు మళ్లీ మళ్లీ చూసినట్టు అనిపిస్తుంది. జేమ్స్ కామెరూన్ మార్క్ ఎమోషన్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఇందులో లోపించాయి. ఒక మాస్టర్ పీస్ నుండి ఆశించే ఆ అడ్రినలిన్ రష్ ఈ సినిమాలో మిస్ అయ్యిందనే చెప్పాలి. యాక్షన్ కంటే డైలాగ్ డ్రామాపైనే ఆధారపడటం వల్ల మూవీ నత్త నడకతో సాగుతుంది. గంటన్నరకు నిడివి ఉన్న ఫస్టాఫ్ ప్రేక్షకులకు ఊపిరిసలపకుండా చేస్తుంది.
కథ పరంగా నిరాశపరిచినా, టెక్నికల్ అంశాల్లో మాత్రం ఈ సినిమా ఒక అద్భుత దృశ్యకావ్యమే. VFX క్లారిటీ చూస్తే మతిపోతుంది. ప్రతీ ఫ్రేమ్‌లోనూ దర్శకుడు తీసుకున్న జాగ్రత్త, ఆ డిటైలింగ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమా కోసం వాడిన రంగులు, బ్రైట్నెస్, విజువల్ పాలిష్ అన్నీ బాగా కుదిరాయి. తెరపై ఆ విజువల్స్ చూస్తుంటే తెలియని ఒక ఆనందం కలుగుతుంది. కేవలం ఈ విజువల్ గ్రాండియర్ కోసమే సినిమాను చూడొచ్చు. ఇలాంటి సినిమాలను మంచి స్క్రీన్ మీదే చూడాలి. 3D ఎఫెక్ట్స్ చాలా ఫెంటాస్టిక్‌గా వచ్చాయి. ముఖ్యంగా PCX స్క్రీన్‌పై చూస్తే.. ఆ అనుభూతి ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ గానీ, ఆ ప్రపంచంలో మనం కూడా ఉన్నామనే భావన గానీ 3Dలో అద్భుతంగా పండాయి. టెక్నాలజీని వాడుకోవడంలో కామెరూన్ ఎప్పుడూ ముందుంటాడని ఈ సినిమా మరోసారి నిరూపించింది.






