SAvsAFG: నరాల తెగే ఉత్కంఠ.. డబుల్ సూపర్ ఓవర్లో సఫారీల విజయం!
చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే అత్యంత ఉత్కంఠభరితమైన టీ20 ప్రపంచకప్ (T20 World Cup) మ్యాచ్ .. అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠను పంచింది. దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ (SAvsAFG) జట్ల మధ్య జరిగిన పోరులో గెలుపు దోబూచులాడింది. మైదానంలో నరాల తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో.. రెండు సార్లు సూపర్ ఓవర్లు వేయాల్సి వచ్చింది. ఇలా జరగడం వరల్డ్ కప్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆఖరి బంతి వరకు ఫలితం ఎటు వైపు మొగ్గుతుందో తెలియని స్థితిలో, చివరకు అనుభవం కలిగిన దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 187/6 పరుగుల స్కోరు చేసింది. సఫారీ బ్యాటర్లలో క్వింటన్ డీకాక్ (59), ర్యాన్ రికెల్టన్ (61) రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ మూడు, రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీసుకున్నారు. ఛేజింగ్‌లో రహ్మనుల్లా గుర్బాజ్ (84) అద్భుతంగా పోరాడాడు. దీంతో ఆ టీం కూడా 187 పరుగులకు ఆలౌట్ అయింది. సఫారీ బౌలర్లలో లుంగి ఎన్గిడీ మూడు వికెట్లు తీయడంతో పాటు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో అదరగొట్టాడు. దీంతో ఫలితం తేల్చడానికి సూపర్ ఓవర్‌కు వేయాల్సి వచ్చింది. ఆశ్చర్యకరంగా ఈ ఓవర్లో కూడా ఇరుజట్లు (SAvsAFG) సమానంగా 17 పరుగులే చేయడంతో మ్యాచ్ మళ్ళీ టై అయ్యింది. స్టేడియంలోని ప్రేక్షకులే కాదు, టీవీల ముందున్న కోట్లాది మంది అభిమానులు సీట్ల అంచులపై కూర్చుని ఈ డ్రామాను వీక్షించారు. నిబంధనల ప్రకారం రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఈసారి దక్షిణాఫ్రికా బౌలర్లు, బ్యాటర్లు ఒత్తిడిని సమర్థవంతంగా జయించారు. రెండో సూపర్ ఓవర్లో సఫారీలు 23/1 పరుగులు చేయగా.. ఆఫ్ఘనిస్తాన్ 19/2 పరుగులే చేయగలిగింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన సఫారీ బౌలర్ల లుంగి ఎన్గిడీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా (SAvsAFG) గెలిచినప్పటికీ, నిజమైన హీరోలు మాత్రం ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లే అని చెప్పాలి. పటిష్టమైన దక్షిణాఫ్రికా జట్టును ముప్పుతిప్పలు పెట్టి, ఓటమి అంచుల వరకు నెట్టారు. ఆఫ్ఘన్ బౌలర్ల పోరాట పటిమ, ఫీల్డింగ్ విన్యాసాలు ప్రపంచ స్థాయికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఉన్నాయి. కేవలం అదృష్టం, క్లిష్ట సమయాల్లో దక్షిణాఫ్రికా చూపిన సంయమనం వల్లే ఆ జట్టు గట్టెక్కింది. ఈ ఏడాది ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో ఇదే అత్యుత్తమ మ్యాచ్ అని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు కొనియాడుతున్నారు.













