TAMA: తామా ఆధ్వర్యంలో ఘనంగా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు
అమెరికాలోని జార్జియా రాష్ట్రం, కమ్మింగ్ సిటీలో 2026 జనవరి 26వ తేదీన తెలుగు అసోసియేషన్ అఫ్ మెట్రో అట్లాంటా (తామా) వారు భారత దేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తామా అధ్యక్షురాలు సునీత పోట్నూరు, బోర్డు ఛైర్మన్ మధుకర్ యార్లగడ్డ అందరినీ కార్యక్రమానికి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన దేవ్ రాపూరి(16 సంవత్సరాలు వైమానిక దళం లో పని చేసి దేశ సంరక్షణలో భాగంగా కార్గిల్ యుద్ధంలో మరియు ఆపరేషన్ పరాక్రమ్ లో పనిచేశారు) ఆర్టికల్ 51 పేరుతో సమానత్వం గురించి ఉపదేశించారు. ఈ వేడుకకి విచ్చేసిన మరొక ముఖ్య అతిధి రాజ లంక మాట్లాడుతూ తాను దేశానికి 378 మిలియన్ సెకన్లు సేవ చేశానని, ప్రతి సెకను ప్రత్యేకమైనదని ఆయన అన్నారు. మీరు కలుసుకునే ప్రతి సైనికుడికి ‘ధన్యవాదాలు’ చెప్పాలని కూడా ఆయన అన్నారు. మరో ముఖ్య అతిథిగా హాజరైన మోహన్ దేవ్ గారు మన వ్యక్తిత్వం, నైతిక విలువల ప్రాముఖ్యతను వివరించారు. ముగ్గురు అతిథులను తామా చైర్మన్ మధుకర్ యార్లగడ్డ, తామా అధ్యక్షురాలు సునీత పోట్నూరు శాలువా కప్పి, పుష్పగుచ్చాన్ని అందించి ఘనంగా సత్కరించారు.
ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ ఈ గణతంత్ర దినోత్సవ వేడుకకు దాదాపు 100 కి పైగా ప్రవాస భారతీయులు హాజరై తమ దేశభక్తిని చాటుకొన్నారు. ఈ వేడుకకు తరలి వచ్చిన ప్రవాస భారతీయులకు ముఖ్య అతిధులు, తామా అధ్యక్షురాలు (సునీత పోట్నూరు) గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దేవ్ రాపూరి ,రాజ లంక మరియు మోహన్ దేవ్ గారు మువ్వన్నెల జెండాను ఎగురవేసి, వందనం చేయగా అందరూ భారత దేశ జాతీయ గీతం ఆలపించి తమ గౌరవాన్ని తెలియజేసారు. వచ్చిన పిల్లలకు, అతిధులకు తామా వారు చాక్లేట్లు, తేనీరు, అల్పాహారం సమకూర్చారు.
భారత దేశ పతాకంతో పాటుగా అమెరికా దేశపు పతాకాన్ని కూడా ఆవిష్కరించారు. ఇది ఇరు దేశాల సంబంధాలకు ప్రతీకగా నిలిచింది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఈ వేడుకకు ప్రాంతీయ, జాతీయ ప్రవాస భారతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా గానవాహిని పాఠశాల వారి గాయనీమణులు (వాహిని వారి గాన బృందం) దేశభక్తి గీతాలు ఆలపించారు.
ఈ కార్యక్రమంలో కార్యవర్గ మరియు బోర్డు సభ్యులు సునీత పోట్నూరు, మధుకర్ యార్లగడ్డ, రాఘవ తడవర్తి, తిరుమలరావు చిల్లపల్లి, సునీల్ దేవరపల్లి, సాయిరాం కారుమంచి, సత్య నాగేంద్ర గుత్తుల, శేఖర్ కొల్లు, పార్వతి కొంపెల్ల, చైతన్య కొర్రపాటి, నరేన్ నల్లూరి, ముఖర్జీ వేములపల్లి, ప్రియ బలుసు, హరికృష్ణ అడ్డంకి, వెంకట్ తెరాల, యశ్వంత్ జొన్నలగడ్డ, నాగేష్ దొడ్డక, సురేష్ యాదగిరి, శశి దగ్గుల, హర్ష కొప్పుల, మహేష్ కొప్పు మొదలగు వారు పాల్గొన్నారు.













