Foreclosure: రుణం ముందే తీర్చేస్తే ‘సిబిల్’ స్కోర్ పడిపోతుందా?
మధ్యతరగతి జీవికి చేతిలో కాస్త డబ్బు మెదలగానే, నెత్తిన ఉన్న అప్పుల భారాన్ని దించుకోవాలని ఆశపడటం సహజం. బ్యాంకులకు నెలనెలా వడ్డీలు కట్టడం కన్నా, చేతికి వచ్చిన మొత్తంతో అసలు తీర్చేస్తే (Foreclosure/Pre-closure) ప్రశాంతంగా ఉండొచ్చని, ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుందని చాలామంది భావిస్తుంటారు. అయితే గడువు కంటే ముందే రుణాన్ని పూర్తిగా చెల్లించడం వల్ల మన క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ (CIBIL) స్కోర్‌పై ఏమైనా ప్రతికూల ప్రభావం పడుతుందా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. దీనిపై ఆర్థిక నిపుణులు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు.
వాస్తవానికి, గడువు తీరకముందే రుణాన్ని తీర్చేయడం (Foreclosure) అనేది మీ ఆర్థిక స్తోమతకు, క్రమశిక్షణకు నిదర్శనంగా నిలుస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో మీ అప్పులు తీసుకునే సామర్థ్యం (Debt Burden Ratio) మెరుగుపడుతుంది. అంటే మీ ఆదాయంలో ఈఎంఐలకు పోను మిగిలే మొత్తం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి, కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తాయి. అయితే ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది. లోన్ క్లోజ్ చేసిన వెంటనే మీ క్రెడిట్ స్కోర్‌లో స్వల్ప తగ్గుదల కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం మీ ‘క్రెడిట్ హిస్టరీ’ నిడివి తగ్గడమే. ఓపెన్ లోన్ అకౌంట్లు ఉన్నప్పుడు మీ చెల్లింపుల చరిత్ర కొనసాగుతూ ఉంటుంది, అది స్కోర్‌కు బలాన్నిస్తుంది. అకౌంట్ క్లోజ్ అవ్వగానే ఆ చరిత్ర ఆగిపోతుంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అలాగే ‘క్రెడిట్ మిక్స్’ (Credit Mix) అనే అంశం కూడా ఇక్కడ పనిచేస్తుంది. సెక్యూర్డ్ (హోమ్, కార్ లోన్), అన్సెక్యూర్డ్ (పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్) రుణాల మిశ్రమం ఉంటే స్కోర్ బాగుంటుంది. ఒకదాన్ని క్లోజ్ (Foreclosure) చేయడం వల్ల ఆ సమతుల్యత దెబ్బతిని స్కోర్ తాత్కాలికంగా తగ్గవచ్చు. కానీ దీర్ఘకాలికంగా చూస్తే అప్పులు లేకపోవడమే ఆరోగ్యకరమైన ఆర్థిక స్థితికి సూచిక. మీ క్రెడిట్ రిపోర్ట్‌లో ‘క్లోజ్డ్’ (Closed) అని చూపించడం వల్ల మీరు రుణాన్ని విజయవంతంగా తిరిగి చెల్లించారని రికార్డవుతుంది. ఇది పాజిటివ్ పాయింట్. కాబట్టి స్కోర్ గురించి మరీ ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.













