Airlines: విమానయాన రంగానికి భారీ నష్టాలు.. లాభాల్లో రారాజుగా ‘ఇండిగో’
దేశీయ విమానయాన రంగం (Airlines) ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను చవిచూస్తోంది. ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నప్పటికీ, చాలా విమానయాన సంస్థలు ఇంకా నష్టాల ఊబిలోనే కొనసాగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రాజ్యసభలో వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ అందించిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం, దేశంలోని ఎయిర్‌లైన్స్ (Airlines) మొత్తంగా రూ. 5,289.73 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేశాయి. ఇందులో టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా సంస్థల నష్టాలే అత్యధికంగా ఉండటం గమనార్హం. కేవలం ఎయిర్ ఇండియా గ్రూప్ (ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కలిపి) ఏకంగా రూ. 9,808.12 కోట్ల భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఇందులో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వాటానే రూ. 5,832.37 కోట్లు కాగా, ఎయిర్ ఇండియా నష్టం రూ. 3,975.75 కోట్లుగా నమోదైంది.
మరోవైపు మార్కెట్ దిగ్గజం ఇండిగో (IndiGo) మాత్రం ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ లాభాల పంట పండించింది. దేశంలో మొత్తం 11 విమానయాన ఆపరేటర్లు (Airlines) ఉండగా, కేవలం నాలుగు సంస్థలు మాత్రమే లాభాలను ఆర్జించగలిగాయి. అందులో ఇండిగో ఏకంగా రూ. 7,253.30 కోట్ల భారీ లాభాన్ని సొంతం చేసుకుని, విమానయాన రంగంలో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. ఇండిగో లాభాలతో పోలిస్తే మిగిలిన మూడు సంస్థల లాభాలు చాలా స్వల్పం. స్టార్ ఎయిర్ రూ. 68.75 కోట్లు, బ్లూ డార్ట్ రూ. 71 లక్షలు, ఇండియావన్ ఎయిర్ రూ. 33 లక్షల లాభాలను పొందాయి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఇక నష్టాల జాబితాలో కొత్తగా వచ్చిన ఆకాశ ఎయిర్ కూడా చేరింది. ఆ సంస్థ రూ. 1,986.25 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థ అలయన్స్ ఎయిర్ రూ. 691.12 కోట్లు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న స్పైస్‌జెట్ రూ. 55.67 కోట్లు నష్టపోయాయి. చిన్న సంస్థలైన ఫ్లై91 సుమారు రూ. 67 కోట్లు, క్విక్‌జెట్ కార్గో రూ. 1.34 కోట్ల నష్టాలను చవిచూశాయి. మొత్తానికి ఎయిర్ ఇండియా గ్రూప్ పునరుద్ధరణ దశలో భారీ నష్టాలను ఎదుర్కొంటుండగా, ఇండిగో మాత్రం ఏకచక్రాధిపత్యంతో దూసుకుపోతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.













