Nikhil: స్వయంభు అందుకే లేటైంది
కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. కార్తికేయ 2 విజయం అనంతరం ప్రేక్షకుల అంచనాలు మరింత పెరగడంతో, వాటిని మించిపోయే కథ కోసం ఎదురుచూశానని నిఖిల్ తెలిపాడు. రెండేళ్లుగా సినిమాలు విడుదల కాకపోయినా అభిమానులు, పరిశ్రమ వర్గాలు తనకు అండగా నిలిచారని స్వయంభు టీజర్ లాంచ్ సందర్భంగా నిఖిల్ ఎమోషనల్ అవుతూ చెప్పాడు.
ప్రస్తుతం కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ డ్రామా ‘స్వయంభు’లో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా 1000 ఏళ్ల క్రితం రాయలసీమ ప్రాంతానికి చెందిన కృష్ణ అనే యోధుడి గాథ ఆధారంగా రూపొందుతోంది. అల్లరిగా తిరిగే యువకుడు ఎలా శక్తివంతమైన యోధుడిగా ఎదిగి రాజ్యాలను శాసించే స్థాయికి చేరుకున్నాడనే ప్రయాణమే ఈ చిత్ర కథాంశమని నిఖిల్ వెల్లడించాడు. చరిత్రలో మరుగునపడిపోయిన యోధుల త్యాగాలను పెద్ద తెరపై ప్రతిష్టాత్మకంగా చూపించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపాడు.
టీజర్లో కనిపించిన విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. మనం స్వేచ్ఛగా జీవించడం వెనుక ఎంతోమంది యోధుల త్యాగాలున్నాయని, కానీ పెద్ద పెద్ద రాజుల గురించే ఎక్కువగా చెప్పబడుతుందని నిఖిల్ పేర్కొన్నాడు. కార్తికేయ 2 లాంటి హిట్ తర్వాత మరింత మెరుగైన సినిమా ఇవ్వాలనే ఒత్తిడి సహజమని, అదే తనను మరింత కష్టపడేలా చేసిందని నిఖిల్ అన్నాడు. ఈ సినిమా కోసం రెండేళ్లుగా శారీరకంగా, మానసికంగా ప్రత్యేక శిక్షణ తీసుకున్నానని, స్వయంభు చూసిన తర్వాత ‘నిఖిల్ మా వాడు’ అని ప్రేక్షకులు గర్వంగా చెప్పుకుంటారని ధీమా వ్యక్తం చేశాడు.













