Duvvada Srinivas : “ఏం చేద్దాం శ్రీనివాస్?” దువ్వాడతో జగన్ మాటామంతీ..!!
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పేరు గత కొంతకాలంగా చర్చనీయాంశంగా ఉంది. కుటుంబ కలహాలు, వ్యక్తిగత వివాదాలతో వార్తల్లో నిలిచిన ఆయనపై వైసీపీ అధిష్టానం వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇవాళ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా చోటుచేసుకున్న ఒక ఆసక్తికర సన్నివేశం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.
అసెంబ్లీ ప్రాంగణం నుంచి వైసీపీ అధినేత వైఎస్ జగన్ బయటకు వస్తున్న సమయంలో దువ్వాడ శ్రీనివాస్ ఆయనను కలిశారు. జగన్ కాళ్ళకు నమస్కరించిన దువ్వాడను చూసి జగన్ స్పందిస్తూ, “ఏం చేద్దాం శ్రీనివాస్?”* అని పలకరించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ జగన్ను కలవడం ఇదే మొదటిసారి. సుమారు ఏడు నెలల క్రితం తన వ్యక్తిగత జీవితంలోని వివాదాలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయన్న కారణంతో జగన్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుండి దువ్వాడ ఒంటరిగానే రాజకీయ ప్రయాణం సాగిస్తున్నారు.
ఇవాళ జగన్ ఆయనను పలకరించడమే కాకుండా, తన సమస్యల గురించి చర్చించేందుకు తాడేపల్లి నివాసానికి రావాలని సూచించడం గమనార్హం. మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావులతో నెలకొన్న రాజకీయ విభేదాలను జగన్ దృష్టికి తీసుకెళ్లాలని దువ్వాడ భావిస్తున్నారు. ఈ పరిణామం దువ్వాడ తిరిగి సొంత గూటికి చేరుతారా? అనే ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తోంది.
జగన్తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన దువ్వాడ శ్రీనివాస్ తన అంతరంగాన్ని బయటపెట్టారు. వైసీపీ తనకు మళ్లీ అవకాశం ఇస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ పార్టీ తలుపులు మూసుకుపోతే, వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి తన బలాన్ని నిరూపించుకుంటానని సవాల్ విసిరారు. శాసనమండలిలో తన సొంత అజెండాతో ప్రజా సమస్యలపై గళం విప్పుతానని, ముఖ్యంగా తిరుమల లడ్డూ వంటి అంశాల్లో భక్తుల పక్షాన నిలుస్తానని ప్రకటించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
దువ్వాడ శ్రీనివాస్ విషయంలో జగన్ ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లాలో బలమైన నేతలుగా ఉన్న ధర్మాన సోదరులు దువ్వాడను పార్టీలోకి తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. జిల్లా రాజకీయాల్లో తన పట్టు కోల్పోకుండా ఉండాలంటే దువ్వాడను దూరం పెట్టడమే మేలని జగన్కు సీనియర్ నేతలు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జగన్ ధర్మాన వర్గం వైపు మొగ్గు చూపితే, దువ్వాడకు వైసీపీలో స్థానం లభించడం కష్టమే. అప్పుడు ఆయన ముందున్న ప్రత్యామ్నాయం టీడీపీ లేదా జనసేన వైపు చూడటమేనని ఆయన సన్నిహితులు విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుతానికి దువ్వాడ శ్రీనివాస్ పరిస్థితి అటు ఇటు కాకుండా ఉంది. జగన్ అపాయింట్మెంట్ అయితే ఇచ్చారు కానీ, పార్టీలోకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అన్నది సస్పెన్స్. దువ్వాడ వ్యక్తిగత వివాదాలు పార్టీకి మైనస్ అవుతాయా? లేక ఆయనకున్న నియోజకవర్గ పట్టు ప్లస్ అవుతుందా? అన్నది జగన్ లెక్కలపై ఆధారపడి ఉంటుంది.













