Rythu Bharosa: తెలంగాణలో ‘రైతు భరోసా’ నిధుల విడుదలకు లైన్ క్లియర్!
తెలంగాణ రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’ (Rythu Bharosa) పెట్టుబడి సాయం విడుదలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ నిధుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పెట్టుబడి సాయాన్ని అందించేందుకు అవసరమైన నిధులను సమీకరించే పనిలో ఆర్థిక శాఖ నిమగ్నమైంది. ఇందుకోసం ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్వారా భారీ రుణాన్ని తీసుకునేందుకు సిద్ధమైంది. సెక్యూరిటీల వేలం ద్వారా దాదాపు రూ. 9,000 కోట్ల రుణాన్ని సమీకరించేందుకు ప్రభుత్వం ఇండెంట్ పెట్టినట్లు సమాచారం.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
రాష్ట్ర ఖజానాలో తగినంత నగదు నిల్వలు లేకపోవడంతో రైతు భరోసా (Rythu Bharosa) పథకం అమలులో కొంత జాప్యం జరిగింది. అయితే యాసంగి సీజన్ పనులు ముమ్మరంగా సాగుతుండటం, రైతుల నుండి ఒత్తిడి పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. ఆర్బీఐ నిర్వహించే వేలంలో పాల్గొనడం ద్వారా ఒకటి రెండు రోజుల్లోనే ఈ నిధులు రాష్ట్ర ఖజానాకు చేరే అవకాశం ఉంది. ఆ వెంటనే ఎలాంటి ఆలస్యం లేకుండా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసే (Rythu Bharosa) ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ అర్హులైన రైతుల జాబితాను సిద్ధం చేసింది.
ముందుగా తక్కువ విస్తీర్ణం కలిగిన చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇస్తూ (Rythu Bharosa) నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ తర్వాత దశలవారీగా రైతులందరికీ ఈ సాయం అందనుంది. సంక్రాంతి పండుగ సమయానికే నిధులు వస్తాయని ఆశించిన అన్నదాతలకు నిరాశ ఎదురైనా, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వారికి పెద్ద ఊరటనిస్తోంది. ఈ నిధులు చేతికి అందితే ఎరువులు, పురుగుమందులు, ఇతర పెట్టుబడి ఖర్చులకు వెసులుబాటు కలుగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.













