Sree Leela: శ్రీలీల.. ఇకపై యాక్టర్ తో పాటూ డాక్టర్ కూడా
అందాల హీరోయిన్ శ్రీలీల(Sree Leela) ఇప్పుడు అఫీషియల్ గా డాక్టర్‌గా మారింది. సినిమాల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, తన చదువు విషయంలో ఎప్పుడూ రాజీపడకుండా వైద్య విద్యను పూర్తి చేయడం విశేషం. ముంబైలోని డి.వై. పాటిల్ విశ్వవిద్యాలయం(Patil University) నుండి ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమె, ఫిబ్రవరి 10న జరిగిన స్నాతకోత్సవ వేడుకలో వైద్య పట్టాను స్వీకరించింది. ఈ సందర్భంగా వేదికపై మెరూన్ కలర్ బట్టల్లో డిగ్రీ అందుకుంటున్న ఆమె ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు, నెటిజన్లు శ్రీలీలకు అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే శ్రీలీల డాక్టర్ కావాలనే నిర్ణయం వెనుక ఒక భావోద్వేగ సంఘటన ఉంది. ఒకసారి తన అమ్మమ్మ కిందపడిపోయినప్పుడు, వైద్యుడైన తన అన్నయ్య వచ్చి చికిత్స చేయడంతో ఆమె మామూలు స్థితికి చేరుకున్నారని శ్రీలీల వెల్లడించింది. ఆ ఘటన తనపై గాఢమైన ప్రభావం చూపిందని, అప్పుడే డాక్టర్ కావాలనే సంకల్పం కలిగిందని తెలిపారు. కుటుంబంలో జరిగిన ఆ చిన్న సంఘటననే తన జీవిత లక్ష్యాన్ని నిర్ధేశించిందని ఆమె పేర్కొన్నారు.
సినిమా రంగంలో విజయవంతంగా ముందుకు సాగుతూ కూడా వైద్య విద్యను పూర్తి చేయడం ద్వారా శ్రీలీల తన పట్టుదల, క్రమశిక్షణను నిరూపించింది. గ్లామర్ ప్రపంచం ఒకవైపు, సేవామార్గం మరోవైపు ఈ రెండింటినీ సమతూకంగా నడిపించగలిగిన ఆమెపై అభిమానులు గర్వం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో డాక్టర్‌గా సమాజానికి సేవ చేయాలన్న తన ఆశయాన్ని శ్రీలీల మరింత బలంగా కొనసాగించనున్నట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి.













