Najam Sethi: మేము కాదు ఐసీసీనే దిగొచ్చింది.. పాక్ వింత వాదన..
కిందపడ్డ పైచేయి నాదే అనే రకమని పేరున్న పాకిస్తాన్.. దాన్ని మరింత గట్టిగా నిలబెట్టుకునేలా ప్రవర్తిస్తోంది. భద్రతా కారణాలదృష్ట్యా భారత్ లో ఆడబోమన్నబంగ్లాదేశ్ ను తప్పించి స్కాట్లాండ్ టీమును.. ఐసీసీ , టీట్వంటీ ప్రపంచకప్ లోకి తీసుకుంది. అయితే బంగ్లాదేశ్ కు మద్దతుగా పాకిస్తాన్ కూడా భారత్ తో మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి, ఆ తర్వాత యూటర్న్ తీసుకున్న పాకిస్థాన్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ విషయంలో తాము వెనక్కి తగ్గలేదనింది., అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)నే దిగివచ్చిందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ ఛైర్మన్ నజం సేథీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వారం రోజుల ఉత్కంఠ తర్వాత, ఫిబ్రవరి 10న పాక్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. లాహోర్లో ఐసీసీ, పీసీబీ, బంగ్లాదేశ్ బోర్డు ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల ఫలితంగా, మిత్ర దేశాల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే, నజం సేథీ వాదన ఇందుకు భిన్నంగా ఉంది. భారత్-పాక్ మ్యాచ్కు ఉండే ఆర్థిక ప్రాధాన్యత దృష్ట్యా నష్టాన్ని భరించలేకే ఐసీసీ వెనక్కి తగ్గిందని, పాకిస్థాన్ కాదని ఆయన పేర్కొన్నారు. .
2026 టీ20 ప్రపంచకప్లో భాగంగా ఈ నెల 15న శ్రీలంకలోని కొలంబో వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మద్దతుగా ఈ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం మొదట ప్రకటించింది. టీట్వంటీ ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ ను తొలగించడాన్ని నిరసిస్తూ పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ హెచ్చరికల నడుమ మిత్రదేశాలతో చర్చల అనంతరం పాక్ తన నిర్ణయం మార్చుకుంది.













