UBS: హైదరాబాద్‌లో కొలువుల జాతర.. గచ్చిబౌలికి వచ్చిన స్విస్ దిగ్గజం ‘UBS’
UBS: ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ UBS, హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో (సెంటారస్ బై ఫీనిక్స్) తన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. దీని ద్వారా భారత్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు, నగరంలో కార్యకలాపాలను భారీగా విస్తరించనుంది.
మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభోత్సవం: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ డి. శ్రీధర్ బాబు ఈ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCC) కోసం బలమైన వ్యవస్థ ఉందని, UBS విస్తరణ హైదరాబాద్ కీర్తిని మరింత పెంచుతుందని కొనియాడారు.
3,000 కొత్త ఉద్యోగాలు: ఈ విస్తరణలో భాగంగా రాబోయే కొద్ది నెలల్లో 2,000 నుండి 3,000 మంది నిపుణులను నియమించుకోనున్నట్లు UBS ప్రకటించింది. దీనితో హైదరాబాద్‌లో ఆ సంస్థ ఉద్యోగుల సంఖ్య రెట్టింపు కానుంది.
టెక్నాలజీపై దృష్టి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి అత్యాధునిక సాంకేతికతలతో పాటు ఫైనాన్స్, ఆపరేషన్స్ రంగాల్లో ఈ కేంద్రం కీలకంగా పనిచేస్తుందని భారత్ సర్వీస్ కంపెనీ హెడ్ మథియాస్ షాకే తెలిపారు.
భారత్ – స్విట్జర్లాండ్ సంబంధాలు: స్విస్నెక్స్ ఇండియా సీఈఓ డాక్టర్ ఏంజెలా హోనెగర్ మాట్లాడుతూ.. ఈ విస్తరణ భారత్, స్విట్జర్లాండ్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను, పెట్టుబడులను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
2020లో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన UBS.. పూణే, నవీ ముంబై తర్వాత ఇక్కడ తన మూడవ పెద్ద కేంద్రాన్ని ఏర్పాటు చేసి, గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మారుస్తోంది.













