Municipal Elections : పట్టణాల్లో పోటెత్తిన ఓటర్లు.. ఎగ్జిట్ పోల్స్‌లో ‘హస్తం’ హవా!
తెలంగాణలో మినీ అసెంబ్లీని తలపించిన మున్సిపల్ ఎన్నికల ఘట్టం ఉత్కంఠభరితంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 నగరపాలక సంస్థలకు జరిగిన పోలింగ్‌లో ఓటర్లు చైతన్యాన్ని ప్రదర్శించారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి రేపు (శుక్రవారం) జరగబోయే ఓట్ల లెక్కింపుపైనే నెలకొంది.
రాష్ట్రవ్యాప్తంగా సగటున 73.01 శాతం పోలింగ్ నమోదైంది. గత 2020 మున్సిపల్ ఎన్నికల్లో నమోదైన 74.40 శాతంతో పోలిస్తే ఇది స్వల్పంగా తక్కువైనా, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇది భారీ పోలింగ్‌గానే విశ్లేషకులు భావిస్తున్నారు. పోలింగ్ నమోదులో నగరాల కంటే పట్టణాలే మెరుగ్గా ఉన్నాయి. మున్సిపాలిటీల్లో 75.88శాతం పోలింగ్ నమోదు కాగా, కార్పొరేషన్లలో 66.05శాతం మాత్రమే నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో అత్యధికంగా 91.91శాతం పోలింగ్ జరగడం విశేషం. కాగా, నల్గొండ జిల్లాలోని నందికొండలో అత్యల్పంగా 59.68శాతం నమోదైంది. పురుషుల (72.63%) కంటే మహిళలే (73.39%) ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడం గమనార్హం.
పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. పీపుల్స్ పల్స్, వీ6-వెలుగు సంస్థల అంచనాలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. కాంగ్రెస్ పార్టీ ఏకంగా 68 నుండి 95 మున్సిపాలిటీలను కైవసం చేసుకునే అవకాశం ఉందని అంచనా. ఓట్ల శాతం పరంగా ఆ పార్టీకి 36శాతం దక్కవచ్చు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 15 నుండి 36 మున్సిపాలిటీలకు పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. కార్పొరేషన్లలో ఆ పార్టీకి ఒక్క మేయర్ పీఠం కూడా దక్కకపోవచ్చని సర్వేలు చెబుతున్నాయి. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ వంటి చోట్ల ఎంఐఎం కింగ్ మేకర్ గా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
రామగుండం, మంచిర్యాల, కొత్తగూడెం కార్పొరేషన్లను కాంగ్రెస్ కైవసం చేసుకోనుంది. మహబూబ్‌నగర్, నల్గొండ కార్పొరేషన్లలో కాంగ్రెస్ మెజారిటీ సాధించనుంది. నిజామాబాద్, కరీంనగర్ లలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది.
ఈ ఎన్నికల్లో సంక్షేమ పథకాల ప్రభావం కంటే స్థానిక సమస్యలు, అభ్యర్థుల పనితీరు కీలకంగా మారాయి. భారీ పోలింగ్ నమోదైన ప్రాంతాల్లో ప్రభుత్వంపై ఉన్న నమ్మకమా లేక మార్పు కోసమా అన్నది ఫలితాల్లో తేలనుంది. ముఖ్యంగా రెబల్స్ ప్రభావం 8 నుండి 14 మున్సిపాలిటీల్లో ఫలితాలను తారుమారు చేసేలా ఉంది. 1210 నుండి 1290 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అంచనా వేయడం చూస్తుంటే, పట్టణ ఓటర్లు హస్తం వైపు మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది.
శుక్రవారం ఉదయం 8 గంటల నుండి 138 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. సాయంత్రానికి పట్టణ పీఠాలు ఎవరివో తేలిపోనుంది. ఈ నెల 16న మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల పరోక్ష ఎన్నిక జరగనుంది.













