Kolikapudi : కొలికిపూడికి మళ్లీ వార్నింగ్.. ఇకనైనా మారతారా..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే తెలుగుదేశం పార్టీలో, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలిపై పార్టీ అధిష్టానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అసెంబ్లీ లాబీల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కొలికిపూడితో భేటీ అయి, సీఎం ఆదేశాల మేరకు గట్టి హెచ్చరికలు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
చంద్రబాబు మార్క్ రాజకీయాల్లో వ్యక్తిగత ఇమేజ్ కంటే పార్టీ క్రమశిక్షణే ముఖ్యం. కొలికిపూడి శ్రీనివాసరావు గత కొంతకాలంగా చేస్తున్న వ్యాఖ్యలు, అనుసరిస్తున్న విధానాలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలోనే పల్లా శ్రీనివాస్ ఆయనకు ముఖాముఖిగా కొన్ని కీలక విషయాలను స్పష్టం చేశారు. వ్యక్తిగత అజెండాల కంటే పార్టీ నిర్ణయాలే సుప్రీం అని పల్లా స్పష్టం చేశారు. తప్పులు చేస్తూ పోతే చూస్తూ ఊరుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేరని నేరుగా హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా ఏ ఒక్క ఎమ్మెల్యే ప్రవర్తించినా సహించేది లేదని తేల్చి చెప్పారు.
అధిష్టానం ఆగ్రహాన్ని గమనించిన ఎమ్మెల్యే కొలికిపూడి, తనదైన శైలిలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనకు రాజకీయ అనుభవం తక్కువని, ఆ అనుభవరాహిత్యం వల్లే కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయని ఆయన పల్లా శ్రీనివాస్ వద్ద అంగీకరించారు. సీనియర్లు నాకు మార్గనిర్దేశం చేయాలని.. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానని ఆయన విన్నవించుకున్నారు.
అయితే, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. కొలికిపూడి ఇలా వివరణ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు, పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడితే “ఇంకోసారి జరగదు” అని చెప్పడం, ఆ తర్వాత మళ్లీ అదే పంథాలో వెళ్లడం ఆయనకు పరిపాటిగా మారింది.
కొలికిపూడి శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని అధిష్టానం ఒకవైపు భావిస్తున్నప్పటికీ.. కొన్ని సాంకేతిక, సామాజిక కారణాలు అడ్డు వస్తున్నట్లు తెలుస్తోంది. కొలికిపూడి దళిత సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటే, అది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుందేమోనన్న ఆందోళన పార్టీలో ఉంది. ప్రభుత్వం కొలువుదీరి ఇంకా ఎంతో కాలం కాలేదు. అప్పుడే సొంత ఎమ్మెల్యేలపై వేటు వేయడం వల్ల పార్టీ కేడర్‌లో తప్పుడు సంకేతాలు వెళ్తాయేమోనని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒకసారి తప్పు చేస్తే సరిదిద్దుకోవచ్చు, కానీ అదే పనిగా తప్పులు చేస్తుంటే గట్టిగా మందలించాలనే ఉద్దేశంతోనే పల్లా శ్రీనివాస్‌ను రంగంలోకి దించారు.
టీడీపీలో పల్లా శ్రీనివాస్ ఒక మృదుస్వభావిగా పేరున్నప్పటికీ, చంద్రబాబు ఆదేశాలను అమలు చేయడంలో మాత్రం చాలా కఠినంగా ఉంటారు. లాబీల్లో జరిగిన భేటీ కేవలం ఒక సాధారణ చర్చ మాత్రమే కాదు, అది కొలికిపూడికి ఇచ్చిన ‘చివరి అవకాశం’ అని విశ్లేషకులు భావిస్తున్నారు.
తిరువూరు నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే తీరుపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఒకవైపు దూకుడుగా ఉండటం కార్యకర్తలకు నచ్చినప్పటికీ, పార్టీ లైన్ దాటి విమర్శలు చేయడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతోంది.
కొలికిపూడి శ్రీనివాసరావు తన మాట మీద నిలబడి, సీనియర్ల సూచనల మేరకు తన ప్రవర్తనను మార్చుకుంటారా? లేక యథావిధిగా తన దూకుడును కొనసాగిస్తూ పార్టీ క్రమశిక్షణను సవాల్ చేస్తారా? అనేది వేచి చూడాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఎమ్మెల్యేలందరిపై రిపోర్ట్ కార్డులు సిద్ధం చేస్తున్నారు. ఈ తరుణంలో పల్లా హెచ్చరికలను పెడచెవిన పెడితే, కొలికిపూడి భవిష్యత్తులో రాజకీయంగా మూల్యం చెల్లించుకోక తప్పదన్నది స్పష్టమవుతోంది.













