Municipal Elections: రేపే మున్సిపోల్స్.. సెకండ్ ప్లేస్ ఎవరిది?
తెలంగాణలో పురపాలక పోరుకు సమయం ఆసన్నమైంది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సర్వం సిద్ధం చేసింది. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది. మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్‌కాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించారు. సుమారు 25 వేల మంది పోలీసులతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 11,000 స్మార్ట్ కెమెరాల నిఘాలో పోలింగ్ ప్రక్రియ జరగనుంది. 1,900 సమస్యాత్మక, 1,400 అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ అదనపు బలగాలను మోహరించారు. ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల ద్వారానే జరుగుతుండటంతో, 16,301 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు.
ఈ ఎన్నికలు ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, విపక్ష బీజేపీ మధ్య ముక్కోణపు పోటీని తలపిస్తున్నాయి. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి మున్సిపోల్స్ కావడంతో, కాంగ్రెస్ దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వ పథకాలు, ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు తమను గెలిపిస్తాయని ఆ పార్టీ నమ్ముతోంది. మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకోవడం ద్వారా రాష్ట్రంపై తమ పట్టును నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహరచన చేశారు.
తమ పదేళ్ల అభివృద్ధి పనులే తమకు శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ఎండగడుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో తమకు బలమైన క్యాడర్ ఉందని, అక్కడ మెరుగైన ఫలితాలు సాధిస్తామని గులాబీ దళం ఆశిస్తోంది.
ఉత్తర తెలంగాణపై బీజేపీ గట్టి ఆశలు పెట్టుకుంది. పట్టణ ప్రాంత ఓటు బ్యాంకు సంప్రదాయబద్ధంగా తమకే మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నమ్ముతోంది. నిజామాబాద్, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమైంది.
రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం, ఈ ఎన్నికల్లో ప్రాంతాల వారీగా విభిన్నమైన ట్రెండ్ కనిపిస్తోంది. ఉత్తర తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగనుంది. రామగుండం, నిజామాబాద్ వంటి కార్పొరేషన్లలో బీజేపీ సత్తా చాటాలని చూస్తోంది. ఇక దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్గొండ వంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ, అధికార బలం కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అవకాశం ఉంది. మొదటి స్థానంలో నిలిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా, ప్రధాన ప్రతిపక్షం తామే అని నిరూపించుకోవడానికి బీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.
మొత్తం 2,996 వార్డుల్లో సుమారు 12,993 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ ఫలితాలు తెలంగాణ భవిష్యత్తు రాజకీయ దిశను నిర్దేశించనున్నాయి. ఓటర్లు తమ నగరాల, పట్టణాల అభివృద్ధి కోసం ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి.













