Ambati Rambabu: తగ్గేదేలే.. ఖైదీగా వెళ్తూ అంబటి ‘పుష్ప’ మేనరిజం
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు చుట్టూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఆసక్తికరంగా తిరుగుతోంది. నిన్నటి వరకు అధికారపక్షంలో ఉండి హల్చల్ చేసిన ఆయన, ఇప్పుడు పోలీసు వ్యాన్‌లో ఉండి కూడా వార్తల్లో నిలుస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు కోర్టుకు తరలిస్తున్న క్రమంలో ఆయన ప్రదర్శించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంబటి రాంబాబు శైలే వేరు. మాటల తూటాలు పేల్చడంలో అయినా, ప్రత్యర్థులపై విమర్శలు చేయడంలో అయినా ఆయన ఎప్పుడూ ముందుంటారు. అయితే, తాజాగా ఆయన పోలీసు వాహనంలో కూర్చుని, గెడ్డం కింద చేయి వేసి ‘పుష్ప’ స్టైల్లో ఇచ్చిన రియాక్షన్ రాజకీయంగా పెను చర్చకు దారితీసింది. సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా అవినీతి కేసులో పీటీ వారెంట్‌పై కోర్టుకు వెళ్తున్న అంబటి.. తాను చేసిన తప్పును సమర్థించుకుంటున్నారా? లేక రాజకీయ కక్షసాధింపుగా భావించి సవాల్ విసురుతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గత నెల 31 నుంచి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబుపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. తాజా వివాదం 2023లో సత్తెనపల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల చుట్టూ తిరుగుతోంది. లక్కీ డ్రా టిక్కెట్ల పేరిట భారీ ఎత్తున నిధుల వసూలు జరిగిందని, ఇందులో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు.
ఒక ప్రజాప్రతినిధిగా ఉండి, పండుగ ముసుగులో లాటరీ స్కామ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు ఆయనను ఇప్పుడు కోర్టు గడప తొక్కించాయి. చట్టపరంగా విచారణ ఎదుర్కోవాల్సిన సమయంలో ఆయన ప్రదర్శించిన ‘స్టైల్’ బాధ్యతాయుతమైన నాయకత్వ లక్షణమా? అనే చర్చ మొదలైంది.
పుష్ప సినిమాలో హీరో ఒక స్మగ్లర్. ఎర్ర చందనం దొంగతనం చేస్తూ చట్టాన్ని ధిక్కరించే పాత్ర అది. అక్కడ హీరోగా అల్లు అర్జున్ చేసిన ‘తగ్గేదేలే’ అనే మేనరిజం మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. కానీ, ఒక మాజీ మంత్రి, చట్టసభకు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి, అవినీతి ఆరోపణలతో పోలీసు వ్యాన్‌లో ఉండి అదే స్టైల్‌ను అనుకరించడం విస్మయానికి గురిచేస్తోంది.
బూతులు తిట్టడం లేదా అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లడం అనేది సాధారణంగా అవమానంగా భావిస్తారు. కానీ అంబటి రాంబాబు దానిని ఒక ‘విజయం’లా, తన గొప్పతనంగా ప్రొజెక్ట్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. సినిమాలోని విలన్లకు లేదా యాంటీ-హీరోలకు ఉండే ఆకర్షణను రాజకీయ నాయకులు కోరుకోవడం ప్రజాస్వామ్యానికి చేటు. చట్టం ముందు విచారణకు వెళ్తున్నప్పుడు వినమ్రత కంటే వితండవాదమే ఎక్కువగా కనిపిస్తోంది.
ఒకప్పుడు రాజకీయ నాయకులు జైలుకు వెళ్తున్నారంటే కనీసం నైతిక బాధ్యత వహించేవారు. నేడు పరిస్థితి మారింది. జైలుకు వెళ్లడాన్ని ఒక పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకుంటున్నారు. అంబటి రాంబాబు తనపై ఉన్న కేసులను రాజకీయ కక్షసాధింపుగా చిత్రించే క్రమంలో, ఈ సినిమాటిక్ స్టైల్స్ ను ఆశ్రయిస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు హీరోలకు విలువ ఉండేది.. ఇప్పుడు విలన్లదే హవా అన్నట్లుగా రాజకీయ ముఖచిత్రం మారిపోయింది.
అంబటి తీరును గమనిస్తే, ఆయన తన కేడర్‌కు నేను ధైర్యంగా ఉన్నానని చెప్పాలనుకుంటున్నారా? లేక వ్యవస్థలంటే తనకు లెక్కలేదని చూపిస్తున్నారా? అనే సందేహం ప్రజల్లో కలుగుతోంది. సామాన్యులు ఇలాంటి ప్రవర్తనను చూసి.. తప్పు చేసినా గెడ్డం ఎగరేయవచ్చు అనే తప్పుడు సంకేతాలను అందుకునే ప్రమాదం ఉంది.
రాజకీయాల్లో గెలుపోటములు, కేసులు సహజం. కానీ, ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు హుందాతనం ప్రదర్శించడం నాయకత్వ లక్షణం. పుష్ప సినిమాలో స్మగ్లర్ స్టైల్‌ను కాపీ కొడుతూ అంబటి రాంబాబు చేసిన ఈ హంగామా, ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణల తీవ్రతను తగ్గించకపోగా, ప్రజల్లో విమర్శలకు తావిస్తోంది. కోర్టు విచారణలో నిగ్గు తేలే వరకు ఆయన తగ్గేదేలే అన్నా.. చట్టం ముందు ఎవరైనా తగ్గాల్సిందే అనేది జగమెరిగిన సత్యం.













