Jogi Ramesh: డంప్ నుంచి డిజిటల్ ఆధారాల వరకూ – జోగి రమేష్ కేసులో వెలుగులోకి వస్తున్న నిజాలు
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ (SIT) తాజాగా కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. పూర్తి ఆధారాలు, కీలక వివరాలతో రూపొందించిన ఈ చార్జ్ షీట్ కేసుకు కొత్త మలుపు తీసుకొచ్చింది. జోగి రమేష్‌కు గతంలో వ్యాపార భాగస్వామిగా ఉన్న వ్యక్తే నకిలీ మద్యం ప్రధాన నిందితుడిగా ఉండటం ఈ వ్యవహారంలో కీలక అంశంగా మారింది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ బంధం కొనసాగిందని దర్యాప్తులో తేలింది. అంతేకాదు, ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాల్లో కూడా అదే ప్రధాన నిందితుడిని జోగి రమేష్ ఉపయోగించుకున్నారని సిట్ అభిప్రాయం. పదేళ్ల క్రితం వ్యాపార భాగస్వాములుగా, ఆ తర్వాత నకిలీ మద్యం తయారీదారులుగా, తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాపార లావాదేవీల పేరుతో సంబంధాలు కొనసాగినట్లు విచారణలో వెల్లడైంది. ఈ మొత్తం వ్యవహారం జోగి రమేష్ పాత్రను బలంగా సూచిస్తోందని సిట్ స్పష్టం చేసింది.
చిత్తూరు జిల్లా (Chittoor district) తంబళ్లపల్లె నియోజకవర్గంలో (Tamballapalle constituency) నకిలీ మద్యం డంప్ బయటపడిన విషయం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఆ మరుసటి రోజే ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam)లో జోగి రమేష్ చేసిన హడావుడి అనుమానాలకు తావిచ్చింది. తంబళ్లపల్లెలో పట్టుబడిన నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా అద్దేపల్లి జనార్దన్ రావు (Addepalli Janardhan Rao)ను పోలీసులు గుర్తించారు. ఇతడు జోగి రమేష్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుండటంతో తీగ లాగితే డొంక కదిలినట్టు మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది.
విదేశాల నుంచి భారత్‌కు వస్తున్న సమయంలో జనార్దన్ రావును ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. అనంతరం అతడు విడుదల చేసిన సెల్ఫీ వీడియో మరింత కలకలం రేపింది. గతంలో జోగి రమేష్‌తో చేసిన వ్యాపారాలు, మద్యం లావాదేవీలు, నకిలీ మద్యం దందా, అలాగే కూటమి ప్రభుత్వంపై బురద జల్లే కుట్ర గురించి ఆ వీడియోలో వివరించాడు. తమను నమ్మించి మోసం చేశారని పేర్కొంటూ నిజాలు బయటపెట్టినట్టు చెప్పాడు.
ఈ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసిన సిట్, జోగి రమేష్‌తో పాటు ఆయన సోదరుడిని కూడా అరెస్టు చేసింది. ప్రస్తుతం ఇద్దరూ రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా దాఖలైన చార్జ్ షీట్లో సంభాషణల వివరాలు, డిజిటల్ పేమెంట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లు, ముడుపుల ఆధారాలు పొందుపరిచినట్లు సమాచారం. జనార్దన్ రావు నుంచి జోగి రమేష్ కుటుంబానికి డబ్బులు చేరినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని సిట్ పేర్కొంది. ఈ పరిణామాలతో జోగి రమేష్‌కు ఈ కేసులో తప్పించుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉందని టాక్. మరి ఈ పరిస్థితుల్లో జోగి బ్రదర్స్ భవిష్యత్తు ఏంటి? ఈ నకిలీ మద్యం కేసు మరణి మలుపులు తిరుగుతుంది అన్నది చూడాలి..






