Bangladesh: మళ్లీ యూనస్ నోట సెవెన్ సిస్టర్స్ మాట..!
బంగ్లాదేశ్ లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. నూతన ప్రధానిగా బీఎన్పీ అధినేత తారిఖ్ రెహ్మాన్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయన మంత్రివర్గం ఏర్పాటైంది. దీంతో తాత్కాలిక ప్రభుత్వసారథిగా ఉన్న మహమ్మద్ యూనస్.. పదవి నుంచి వైదొలిగారు. వెళ్లిపోయే ముందు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మహ్మద్ యూనస్..మరోసారి భారత వైఖరిని ప్రదర్శించారు. మన ఈశాన్య రాష్ట్రాలైన ‘సెవెన్ సిస్టర్స్ (Seven Sisters)’ను ప్రస్తావిస్తూ అక్కసు వెళ్లగక్కారు.
‘‘విశాల సముద్రం మా దేశానికి కేవలం భౌగోళిక సరిహద్దు మాత్రమే కాదు. ప్రపంచ ఆర్థికవ్యవస్థతో అనుసంధానం కావడానికి బంగ్లాదేశ్‌కు ఉన్న మార్గం అది. నేపాల్, భూటాన్, సెవెన్ సిస్టర్స్‌తో కలిసి ఈ ప్రాంతం గొప్ప ఆర్థిక సామర్థ్యాన్ని కలిగిఉంది’’ అని యూనస్ తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. భారత్ పేరును నేరుగా ప్రస్తావించకుండా.. మన ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ (Bangladesh)తో కలిపి ఓ సబ్-రీజియన్‌గా పేర్కొనడం రెచ్చగొట్టే చర్యేనని స్పష్టమవుతోంది.

మన దేశంపై యూనస్ ఇలా నోరు పారేసుకోవడం కొత్తేం కాదు. గతంలో చైనా పర్యటన సందర్భంగా భారత ఈశాన్య రాష్ట్రాల గురించి ప్రస్తావించారు. ఈ రాష్ట్రాల వారు సముద్రానికి చేరుకోవడానికి వేరే మార్గం లేదని, ఈ ప్రాంతంలో సముద్రానికి తామే రక్షకులమని అన్నారు. చైనా ఆర్థిక బేస్‌ను విస్తరించుకోవడానికి ఇది భారీ అవకాశం అంటూ కవ్వింపులకు పాల్పడ్డారు. ఈ వ్యాఖ్యలను నాడు భారత్ తీవ్రంగా ఖండించింది.
2024లో విద్యార్థుల ఆందోళనలతో మాజీ ప్రధాని షేక్ హసీనా గద్దె దిగిన సంగతి తెలిసిందే. అనంతరం ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వానికి యూనస్ సారథ్యం వహించారు. 18 నెలల పాటు ఆయన నేతృత్వంలో పాలన సాగింది. ఈ క్రమంలోనే అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. సోమవారం తన బాధ్యతల నుంచి వైదొలుగుతూ.. బంగ్లాదేశ్ ఏమాత్రం లొంగిపోయే దేశం కాదని వ్యాఖ్యానించారు. ఇతర దేశాల సలహాలు, సూచనలతో తమ ప్రభుత్వం పనిచేయబోదని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి













