Vishwak Sen: అకౌంట్ లో రూ.1 లక్ష చూస్తే చాలనుకున్నా
ఇండస్ట్రీలో సక్సెస్ ఎక్కువ మాట్లాడుతుంది. సక్సెస్ ఉంటేనే ఎవరైనా పట్టించుకుంటారంటూ తన జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్. టాలెంట్ ఉన్నా, ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోతే గుర్తింపు రాదని ఆయన స్పష్టంగా చెప్పారు. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, బయట నుంచి కనిపించే గ్లామర్ వెనుక ఎంత కఠినమైన పోరాటం ఉంటుందో చాలా మందికి తెలియదని అన్నారు. తాను పుట్టినప్పుడు తమకు సొంతిల్లు కూడా లేదని, సాధారణ కుటుంబంలో పుట్టి పెద్ద కలలు కనడం సులభం కాదని ఎమోషనల్ గా చెప్పారు విశ్వక్ సేన్.
చదువుల విషయంలో కూడా ఆర్థిక పరిమితులు తన నిర్ణయాలను ప్రభావితం చేశాయని చెప్పారు. పెద్ద చదువులు చదవాలంటే ఎక్కువ ఖర్చవుతుందని డిగ్రీలో చేరానని, అప్పట్లో బ్యాంక్ అకౌంట్లో లక్ష రూపాయలు కనిపిస్తే చాలని అనుకునేవాడినని గుర్తుచేసుకున్నారు. తన కెరీర్లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన ఫలక్‌నుమా దాస్ రిలీజైన తర్వాత మొదటిసారి అకౌంట్లో లక్ష రూపాయలు చూసిన సందర్భం మరచిపోలేనిదని తెలిపారు. అయితే దానికంటే రెండు రోజుల ముందే హిట్ సినిమా అడ్వాన్స్‌గా అకౌంట్లో రూ.50 వేలు క్రెడిట్ కావడం తనకు అపారమైన ఆనందాన్ని ఇచ్చిందని విశ్వక్ చెప్పారు.
కెరీర్ స్టార్టింగ్ లో ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉండలేవని కొందరు అన్నారని విశ్వక్ పేర్కొన్నారు. విమర్శలు, అనుమానాలు తనను మరింత కఠినంగా తయారుచేశాయని చెప్పారు. తాను తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కోల్పోనని, అది లేకపోతే మనిషిగా బతికి ఉన్నా వృథానే అనే ఆయన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా విశ్వక్ రీసెంట్ గా ఫంకీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.













