Varanasi: ఆ ఒక్క ఎపిసోడ్‌కే అంత బడ్జెటా?
సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu), దర్శక ధీరుడు రాజమౌళి(rajamouli) కలయికలో రూపొందుతున్న భారీ సినిమా వారణాసి(Varanasi) ఇప్పటికే నేషనల్ లెవెల్ లో చర్చనీయాంశంగా మారింది. భారతీయ సినీ పరిశ్రమలో తెరకెక్కుతున్న అత్యంత ఖరీదైన సినిమాల జాబితాలో వారణాసి స్పెషల్ ప్లేస్ ను సంపాదించుకుంది. పౌరాణిక యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో త్రేతాయుగానికి సంబంధించిన ఒక కీలక ఎపిసోడ్ ఉండగా, ఆ ఒక్క భాగం కోసమే సుమారు రూ.250 నుంచి రూ.300 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. కథా ప్రాధాన్యానికి అనుగుణంగా విజువల్ ఎఫెక్ట్స్, సెట్స్, ఆర్ట్ డిజైన్లపై రాజమౌళి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలుస్తోంది.
త్రేతాయుగాన్ని ప్రేక్షకుల కళ్లముందు సజీవంగా నిలపాలన్న లక్ష్యంతో భారీ స్థాయిలో సెట్ నిర్మాణం జరుగనుందని సమాచారం. ఆ కాలపు సంస్కృతి, నిర్మాణ శైలి, వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఆర్ట్ డైరెక్షన్‌ను అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నారని చెబుతున్నారు. విజువల్ వండర్స్‌కు పెద్దపీట వేస్తూ, అంతర్జాతీయ స్థాయి వీఎఫ్ఎక్స్ నిపుణులతో కలిసి పనిచేయాలనే ప్రణాళిక కూడా సిద్ధమైందట. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక చిత్రీకరణ పద్ధతులు వినియోగించి భారతీయ పురాణ గాథలను గ్లోబల్ ఆడియన్స్‌కు చేరువ చేయాలనే లక్ష్యంతో చిత్రబృందం ముందుకెళ్తోంది.
ఇప్పటికే బాహుబలి(baahubali) చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజమౌళి, ఈసారి వాటిని మించే విజువల్ అనుభూతిని అందించాలనే పట్టుదలతో ఉన్నారని టాక్. భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక నైపుణ్యం, మహేష్ బాబు స్టార్ పవర్ అన్నీ కలిసి వారణాసిని ఇండియన్ సినీ చరిత్రలో మైలురాయిగా నిలపాలనే లక్ష్యంతో నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో రూపుదిద్దుకుంటే, భారతీయ సినిమాకు మరో గ్లోబల్ గుర్తింపును తీసుకురావడం ఖాయం అన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.













