IAS Srilakshmi: ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీం షాక్
తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు పెను సంచలనం సృష్టించిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (OMC) అక్రమ మైనింగ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనను ఈ కేసు నుంచి తప్పించాలంటూ ఆమె దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. దీంతో ఆమె ఇకపై ట్రయల్ కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిన అనివార్య పరిస్థితి శ్రీలక్ష్మికి ఏర్పడింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓఎంసీ సంస్థకు అనంతపురం జిల్లాలో మైనింగ్ లీజులు కేటాయించారు. అప్పట్లో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని సీబీఐ అభియోగం మోపింది. ముఖ్యంగా, మైనింగ్ లీజుల జీవోలో ఉండాల్సిన ‘క్యాప్టివ్ మైనింగ్’ అనే పదాన్ని ఆమె కావాలనే తొలగించారని సీబీఐ వాదించింది. ఈ చిన్న మార్పు ద్వారా నిందితులు ఖనిజాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకుని వేల కోట్ల రూపాయల అక్రమ లాభాలు ఆర్జించడానికి దారులు తెరిచారని దర్యాప్తు సంస్థ కోర్టుకు వివరించింది.
![]()
ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ ధర్మాసనం అత్యంత కీలకమైన, ఘాటు వ్యాఖ్యలు చేసింది. గతంలో ఈ కేసుపై సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను ప్రస్తావిస్తూ.. “గతంలో వేరే కేసుగా భావించి పొరపాటున ఈ కేసుపై స్టే ఇచ్చాం. ఇప్పుడు ఆ పొరపాటును సవరిస్తున్నాం. మేము పొరపాటున ఇచ్చిన స్టేను నిందితులు ఇన్నాళ్లూ ఎంజాయ్ చేశారు” అని ధర్మాసనం వ్యాఖ్యానించడం గమనార్హం. న్యాయవ్యవస్థలో దొరికిన సాంకేతిక వెసులుబాట్లను వాడుకుని విచారణను ఇన్నాళ్లూ జాప్యం చేశారని కోర్టు అభిప్రాయపడింది.
ఇవి కూడా చదవండి
శ్రీలక్ష్మికి ఈ కేసులో విముక్తి కల్పించకూడదని సీబీఐ గట్టిగా వాదించింది. ఆమె పదవిలో ఉన్న కాలంలోనే ఆమె మరిది పేరుతో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని, ఇవి మైనింగ్ కేటాయింపులకు ప్రతిఫలంగా అందిన ‘క్విడ్ ప్రో కో’ లబ్ధి అని సీబీఐ ఆరోపించింది. అలాగే, లీజుల కేటాయింపులో నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కూడా పేర్కొంది.
2022లో తెలంగాణ హైకోర్టు ఆమెను ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, సుప్రీంకోర్టు ఆ తీర్పును కొట్టివేసి, మెరిట్స్ ప్రాతిపదికన మళ్లీ విచారించాలని హైకోర్టును ఆదేశించింది. రెండోసారి విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు, శ్రీలక్ష్మిపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించి ఆమె డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టేసింది. హైకోర్టు తాజా నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రీలక్ష్మి వేసిన పిటిషన్ను ఇప్పుడు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఈ తీర్పు ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక అధికారి తీసుకునే నిర్ణయాలు, జీవోల్లో చేసే మార్పులు దశాబ్దాల తర్వాత కూడా వారిని వెంటాడతాయని ఈ కేసు నిరూపిస్తోంది. శ్రీలక్ష్మి దాదాపు పదేళ్లుగా ఈ న్యాయపోరాటం చేస్తున్నారు. ప్రస్తుత సుప్రీంకోర్టు ఆదేశాలతో ట్రయల్ కోర్టులో విచారణ వేగవంతం కానుంది. అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి వంటి ఇతర నిందితులతో పాటు శ్రీలక్ష్మి కూడా విచారణను ఎదుర్కోవాల్సి రావడంతో.. ఆమె కెరీర్, భవిష్యత్తు చిక్కుల్లో పడినట్లయింది.
సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఉన్న అన్ని న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. “న్యాయం ఆలస్యమవ్వచ్చు కానీ, తప్పించుకోవడం సాధ్యం కాదు” అనే సందేశాన్ని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. ఇకపై సీబీఐ ప్రత్యేక కోర్టులో సాక్ష్యాధారాల విచారణ ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి













