Revanth Reddy: బయోఏషియా సదస్సు లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్…
హైదరాబాద్‌కు స్వాగతం. బయోఏషియాకు స్వాగతం. 23 సంవత్సరాల క్రితం బయోఏషియా ప్రారంభమైనప్పుడు, హైదరాబాద్ అంటే చార్మినార్, బిర్యానీ, ఔషధ తయారీ ,సాఫ్ట్వేర్ నగరం అన్న గుర్తింపు ఉండేది. ఈ రోజు, హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా నిలిచింది. దూరదృష్టి గల నాయకత్వం, స్పష్టమైన విధానాలు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు — ఈ బలాల ఆధారంగా హైదరాబాద్ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లకు, పరిశోధన, డిజైన్‌లో విశిష్టతకు ప్రపంచ కేంద్రంగా ఎదిగింది.
గత రెండు సంవత్సరాల్లోనే, జీవవిజ్ఞాన రంగంలో ₹73,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. కొద్ది వారాల క్రితం దావోస్‌లో మా కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటించాం. జీనోమ్ వ్యాలీని విస్తరించాం. ప్రపంచ స్థాయి పరిశోధన, ఆవిష్కరణలకు “వన్-బయో”ను ప్రారంభించాం. గ్రీన్ ఫార్మా సిటీని వేగవంతం చేసాం. అనేక గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లను ఆహ్వానించాం. ఇది సాధారణ అభివృద్ధి కాదు. ఇది దృఢమైన దృష్టి ఫలితం. దానికి ప్రత్యక్ష సాక్ష్యం బయోఏషియా 2026. ఈ సభను చూస్తుంటే నేను గర్వంగా చెప్పగలను.

బయోఏషియా తన పేరును దాటి, బయో-వరల్డ్‌గా మారుతోంది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 ప్రముఖ సంస్థలకు చెందిన 4,000 మందికి పైగా ప్రతినిధులు ఇక్కడ హాజరయ్యారు. ఫార్మా, బయోసైన్సెస్, బయోటెక్, బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, ఆరోగ్య రంగాల్లో ప్రముఖులు, బిజినెస్ లీడర్స్ మనతో ఉన్నారు. సైన్స్, AI, బయోటెక్ వంటి రంగాల్లో ప్రముఖులను కలిసినప్పుడు అసాధారణమైన ఫలితాలు వస్తాయి.
హైదరాబాద్‌లో జరుగుతున్న బయోఏషియా సదస్సు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి అంతర్జాతీయ గుర్తింపు పొందుతుంది అన్న నాకు నమ్మకం ఉంది. తెలంగాణ తో పాటు ముఖ్యంగా జీవవిజ్ఞాన రంగంపై మా దృష్టిని మీతో పంచుకుంటాను. ఇటీవల మేము “తెలంగాణ రైజింగ్ 2047” విజన్‌ను ప్రకటించాం. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం మా లక్ష్యం.
ఇవి కూడా చదవండి
ప్రస్తుత జీవ విజ్ఞాన ధోరణులను చూస్తే పరిశోధన సంస్థలు, కార్పొరేట్లు, స్టార్టప్‌లు, చిన్న మధ్య తరహా సంస్థలు , ప్రభుత్వం మధ్య బలమైన భాగస్వామ్యం అవసరం. మీరు విశ్వసనీయమైన, స్థిరమైన, భవిష్యత్తు కోసం మంచి వాతావరణాన్ని కోరుకుంటున్నారు. తెలంగాణ అది అందిస్తుంది , హైదరాబాద్ మీ సమాధానం. బల్క్ డ్రగ్స్ నుండి బయాలజిక్స్ వరకు,తయారీ నుండి ఆవిష్కరణ వరకు, భారతదేశం నుండి ప్రపంచ స్థాయి వరకు తెలంగాణ ముందుకు సాగుతోంది.
మేము కేవలం భారతదేశంలోనే పోటీ పడటం లేదు, ప్రపంచంలోని అగ్రగామి క్లస్టర్లతో పోటీ పడుతున్నాం. హైదరాబాద్ ఇప్పటికే గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లకు ప్రాధాన్య గమ్యస్థానంగా మారింది. ఇప్పుడు మనం కలిసి దీన్ని సమగ్ర జీవవిజ్ఞాన రంగానికి ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దుదాం. ఇక్కడ పెట్టుబడులు పెట్టండి,మీ GCCలను స్థాపించండి,ఆవిష్కరణ కేంద్రాలను నిర్మించండి.

మాలిక్యూల్స్, ఔషధాలను డిజైన్ చేయండి, క్లినికల్ అనలిటిక్స్‌ను నడపండి, AI ప్లాట్‌ఫారమ్‌లను అభివృద్ధి చేయండి, డిజిటల్ తయారీని ముందుకు తీసుకెళ్లండి. మా ప్రభుత్వం, అధికారులు, శాస్త్రవేత్తలు, నైపుణ్యంతో కూడిన యువత మీ విజయానికి భాగస్వాములుగా ఉంటారు. మనమంతా కలిసి పనిచేస్తే హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఉన్న స్థితి నుండి ప్రపంచ జీవవిజ్ఞాన రాజధానిగా ఎదుగుతుంది. ప్రపంచానికి తెలంగాణ సిద్ధంగా ఉంది. తెలంగాణ అంటే వ్యాపారం. తెలంగాణ ఎదుగుతోంది — ఈ ఎదుగుదలలో మీరు భాగస్వాములుకండి..
ఇవి కూడా చదవండి













