Telangana Parties: నాకు నువ్వూ.. నీకు నేనూ..! పదవులకోసం బరితెగించిన పార్టీలు..!
రాజకీయం అంటేనే అవకాశవాదం అని నేటి నేతలు మరోసారి నిరూపించారు. సిద్ధాంతాలు, విలువలు, పార్టీ జెండాలు.. ఇవన్నీ కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితమని, అధికారం చేతికి చిక్కే అవకాశం వస్తే శత్రువునైనా కౌగిలించుకోవడానికి సిద్ధమని తెలంగాణ మున్సిపల్ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. నిన్నటి వరకు ఒకరిపై ఒకరు నిప్పులు కురిపించుకున్న నేతలు, నేడు పదవుల పంపకాల కోసం ‘భాయీ-భాయీ’ అంటూ చేతులు కలపడం చూస్తుంటే సామాన్య ప్రజలు విస్తుపోతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 36 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. దీంతో పార్టీలు తమ రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి చేతులు కలిపాయి. ఆదిలాబాద్ లో బిజెపి ఎక్కువ స్థానాలు గెలిచినప్పటికీ, కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎంలు ఏకమై బిజెపిని అధికారానికి దూరం చేశాయి. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిని ఛైర్పర్సన్గా నిలబెట్టి గెలిపించింది. భైంసా ఎంఐఎం కంచుకోట. ఇక్కడ బిజెపి రెబల్ అభ్యర్థికి కాంగ్రెస్, స్వతంత్రులు మద్దతు ఇవ్వడం గమనార్హం. నర్సాపూర్, ఆమనగల్లులో కాంగ్రెస్, బిజెపిలు పరస్పరం సహకరించుకున్నాయి. కాంగ్రెస్కు ఛైర్మన్ పదవి దక్కితే, బిజెపి వైస్ ఛైర్మన్ పదవిని తీసుకుంది. మెదక్ లో బిజెపి గైర్హాజరు కావడం ద్వారా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓటుతో అక్కడ కాంగ్రెస్ పీఠాన్ని దక్కించుకుంది. ఇస్నాపూర్ లో బిజెపి ఎంపీ రఘునందన్ రావు తన ఓటును బిఆర్ఎస్ అభ్యర్థికి వేయడం ద్వారా అక్కడ బిఆర్ఎస్ గెలుపొందింది.
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో కనిపిస్తున్న దృశ్యాలు రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్టగా నిలుస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఉప్పు-నిప్పులా ఉండే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కొన్ని మున్సిపాలిటీల్లో ఒకే తాటిపైకి వచ్చాయి. “బిజెపి-బిఆర్ఎస్ ఒక్కటే” అని కాంగ్రెస్ విమర్శిస్తుంటుంది, “కాంగ్రెస్-బిఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం” చేసుకున్నాయని బీజేపీ ఆరోపిస్తుంటుంది. కానీ, తీరా పదవుల విషయానికొచ్చేసరికి ఈ ఆరోపణలన్నీ గాలికి కొట్టుకుపోయాయి. కేవలం అధికారం దక్కించుకోవడమే పరమావధిగా, ప్రజల తీర్పును అపహాస్యం చేస్తూ ఈ ‘మిలాఖత్’ రాజకీయాలు సాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి
ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ప్రజల ముందుకు వెళ్లేటప్పుడు తాము ఫలానా పార్టీకి వ్యతిరేకమని, వారి పాలన అస్తవ్యస్తమని గొంతు చించుకుని ప్రచారం చేస్తారు. కానీ, ఫలితాల తర్వాత మ్యాజిక్ ఫిగర్ రాకపోతే, వెంటనే తమ బద్ధశత్రువుతోనే జతకడతారు. ఇది ఓటర్లను మోసం చేయడమే. ప్రజలు ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి ఓటేస్తే, గెలిచిన ప్రతినిధులు మాత్రం తమ స్వప్రయోజనాల కోసం వ్యతిరేక పార్టీతో చేతులు కలపడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు.
ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ గిరి దక్కించుకోవడం వెనుక కేవలం రాజకీయ అధికారం మాత్రమే కాదు, ఆర్థిక ప్రయోజనాలు కూడా ముడిపడి ఉంటాయనేది బహిరంగ రహస్యం. భూములకు అనుమతులు, టెండర్లు, నిధుల మంజూరు వంటి అంశాల్లో చక్రం తిప్పవచ్చనే ఆశతోనే, నేతలు తమ ఆత్మగౌరవాన్ని కూడా పక్కన పెట్టి పొత్తులకు సిద్ధపడుతున్నారు.
ఈ వింత పోకడల వల్ల అత్యంత నష్టపోయేది క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలే. ఎన్నికల సమయంలో తమ పార్టీ గెలవాలని, ప్రత్యర్థి పార్టీ నాయకులతో గొడవలకు దిగి, కేసులు వేయించుకుని, శత్రుత్వం పెంచుకునేది కార్యకర్తలు. తమ నాయకుడు గెలవగానే తమ కష్టాలు తీరుతాయని ఆశిస్తారు. కానీ, గెలిచిన తర్వాత అదే నాయకుడు ప్రత్యర్థి పార్టీ నేతతో కలిసి విందులు ఆరగిస్తూ, పదవులు పంచుకుంటూ ఉంటే.. ఆ కార్యకర్తలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తల పట్టుకుంటున్నారు.
తెలంగాణలో చోటు చేసుకుంటున్న ఈ ‘అడ్డగోలు’ పొత్తులు ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నాయి. రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం సిద్ధాంతాలను వదిలేస్తే, వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుంది. పదవుల కోసం పడి చచ్చే నేతలు.. తాము ఎవరి కోసం ఈ పదవులు చేపట్టామో, ఎవరి ఓట్లతో గెలిచామో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. పార్టీల మధ్య ఈ అపవిత్ర కలయికలు దేశ రాజకీయాలకే చేటు. ఇప్పటికైనా నేతలు తమ వైఖరి మార్చుకోకపోతే, భవిష్యత్తులో ప్రజలే వారిని రాజకీయ తెర నుంచి తప్పించడం ఖాయం.
ఇవి కూడా చదవండి













