Bill Gates: పాలనలో టెక్నాలజీ వినియోగంపై బిల్ గేట్స్ కితాబు
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్‌గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి వివిధ ప్రభుత్వశాఖల పనితీరును తెలుసుకుని పాలనలో టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకోవడం పట్ల గ్రేట్ వర్క్ అంటూ కితాబిచ్చారు. ముఖ్యంగా సచివాలయంలోని రియల్‌టైమ్ గవర్నెన్స్ కమాండ్ సెంటర్‌ను (=TGS) సందర్శించినప్పుడు పౌరసేవలకు టెక్నాలజీని వినియోగిస్తున్న తీరును చూసి చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని ఆయన దగ్గరుండి పరిశీలించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు, ఫలితాలను గేట్స్‌కు ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి బిల్‌గేట్స్ తెలుసుకున్నారు.
ట్యాక్స్ కలెక్షన్ ప్రక్రియ అద్భుతం
ఏపీలో ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని చంద్రబాబుని బిల్ గేట్స్ ప్రశ్నించారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని బాబు ఆయనకు వివరించారు. అలాగే భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ వంటి విధానాలతో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని ఉన్నతాధికారులు సైతం బిల్ గేట్స్ కి చెప్పారు.
సంజీవిని ప్రాజెక్ట్ మీద ఆరా
తమ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లాలో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు అమలు గురించి చంద్రబాబుని బిల్ గేట్స్ అడిగి తెలుసుకున్నారు. కుప్పంలో అమలు చేసిన సంజీవని ప్రాజెక్టు చాలా చక్కగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ దట్స్ నైస్ అంటూ బిల్ గేట్స్ వ్యాఖ్యానించడం విశేషం.
ఏఐ వినియోగం గ్రేట్
ఏఐ వినియోగంతో ప్రజారోగ్య సేవలను మరింత మెరుగు పరిచేలా చూస్తున్నామని చంద్రబాబు బిల్ గేట్స్‌కి చెప్పడంతో గ్రేట్ అంటూ కితాబిచ్చారు. బయో డిజైన్ ద్వారా వైద్య సేవలు అందించే విధానాలను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. డయాగ్నోస్టిక్ సేవలు తక్కువ వ్యయానికే అందితే పేదలకు వెసులుబాటు ఉంటుందన్న బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు.
అమరావతి గురించి ఆసక్తి
బిల్ గేట్స్ అమరావతి రాజధాని నిర్మాణ వివరాలను సైతం అడిగి తెలుసుకోవడం విశేషం. రాజధానిలో 30 శాతం గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందంటూ బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. మొత్తానికి బిల్ గేట్స్ ఏపీలోకి అడుగు పెడుతూనే జరుగుతున్న అన్ని కార్యక్రమాల మీద తన అభిప్రాయాన్ని చెప్పారు.
‘హలో ఫ్రెండ్…! హౌ ఆర్ యూ..?’
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మీయ స్వాగతం పలికారు. ఏపీ పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్ అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నప్పుడు. సచివాలయం మొదటి బ్లాక్ వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ బిల్ గేట్స్‌ను ఆహ్వానించారు. చంద్రబాబును చూడగానే ‘హలో ఫ్రెండ్…! హౌ ఆర్ యూ..?’ అంటూ అడిగారు. ముఖ్యమంత్రి.. తన మంత్రివర్గ సహచరులను, సీఎస్ విజయానంద్‌ను బిల్ గేట్స్‌కు పరిచయం చేశారు.
రాష్ట్ర పర్యటనలో భాగంగా బిల్ గేట్స్, గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, సవిత, అనిత, కొల్లు రవీంద్ర, కందులు దుర్గేశ్, కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, సత్య కుమార్ యాదవ్, గుమ్మడి సంధ్యారాణి, పొంగూరు నారాయణ, వివిధ శాఖల విభాగాధి పతులు వర్చువల్‌గా సమావేశానికి హాజరయ్యారు.
ఏఐ మేలు చేస్తుంది…
ఏఐ గురించి ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకోవడానికి వారికి సరైన రీతిలో తగిన స్థాయిలో విద్యా బోధన చేయడానికి ఏఐ ఎంతగానో సహయపడుతుందని చెప్పారు. విద్యారంగంలో అద్భుతమైన మార్పులు తీసుకురావడానికి ఏఐ టెక్నాలజీ పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏపీ రుచులకు బిల్ గేట్స్ ఫిదా
తన పర్యటనలో భాగంగా ఉండవల్లిలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని బిల్ గేట్స్ సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు కోసం రైతులు వాడుతున్న టెక్నాలజీని ప్రత్యక్షంగా వీక్షించారు. స్థానిక మహిళలు బిల్ గేట్స్ కోసం ప్రత్యేకంగా చేసిన ‘మినప పునుగులు’ను బిల్ గేట్స్ రుచిచూశారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో పునుగుల బ్రేక్‌ఫాస్ట్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. టెక్ దిగ్గజానికి కూడా తమ రుచి చూపించారు. వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన బిల్ గేట్స్ కు మహిళలు సంప్రదాయం ప్రకారం నుదుట బొట్టు పెట్టి హారతులిచ్చారు. ఆ తర్వాత ప్రత్యేకంగా తయారు చేసిన పునుగులను రుచి చూడాల్సిందిగా కోరారు. మహిళలు అడిగిన వెంటనే కాదనకుండా బిల్ గేట్స్ వాటిని తిని బాగున్నాయంటూ కితాబునిచ్చారు. అనంతరం వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సాంకేతికత, ఏఐ ఆధారిత రైతు సేవలను ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ పరిశీలించారు.
ఉండవల్లి కరకట్ట సమీపంలోని ఉన్న అరటి తోటలో సాంకేతిక వినియోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. వ్యవసాయం-అనుబంధ రంగాల్లో దిగుబడి పెంపు, సాగు ఖర్చు తగ్గింపుపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను అధికారులు ఆయనకు వివరించారు. నాణ్యమైన పంట ఉత్పత్తుల ఎగుమతులకు ప్రత్యేక కార్యాచరణ అవలంభించి రైతులకు అధిక ఆదాయం వచ్చేలా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు రైతు సేవా కేంద్రాల్లో అనలిటిక్స్, మానిటరింగ్ డాష్‌బోర్డులు వినియోగిస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా మహిళా రైతులు మణి, అన్నపూర్ణ… ఇటీవల ముఖ్యమంత్రి ప్రారంభించిన ఏపీఏఐఎంఎస్ రైతు యాప్ గురించి గేట్స్‌కు తెలియజేశారు. ఈ యాప్ ద్వారా ఏ పంటలు పండించాలి, సాగునీటి నిర్వహణ, నేల స్వభావం, ధరలు, మార్కెట్ సమాచారం, పురుగు మందుల నియంత్రణ వంటి విషయాలు సులభంగా తెలుసుకుంటున్నామని చెప్పారు. ఏఐ ద్వారా పంట తెగుళ్ల గుర్తింపు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, అలాగే డ్రోన్ సేవలు పొంది పురుగు మందులను వినియోగిస్తున్న తీరును తెలిపారు. స్థానిక రైతులతో బిల్ గేట్స్ ముఖాముఖి చర్చించారు. మొదటగా వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి, బిల్ గేట్స్‌కు మహిళా రైతులు ఆత్మీయంగా స్వాగతం పలికారు. ప్రకృతి సేద్యం ద్వారా పండించిన వివిధ రకాల పంటలను గేట్స్ పరిశీలించారు. అనంతరం ఢిల్లీకి పయనమయ్యారు.













