NDA: ఎమ్మెల్యేలకు సీఎం, డిప్యూటి సిఎం వార్నింగ్..!
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినప్పటికీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపించకపోతే పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం కాదనే భావన మూడు పార్టీల్లోనూ కనపడుతుంది. తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో బలం ఉన్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం ఉంది. జనసేన(Janasena) పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత కీలకం. ఇక బిజెపికి ఎన్నికల్లో గెలిచిన గెలవకపోయినా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. అందుకే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్డీఏ కూటమి కీలక అడుగులు వేస్తోంది.
పంచాయతీ ఎన్నికల తో పాటుగా మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, పరిషత్ ఎన్నికల లక్ష్యాలను ఎమ్మెల్యేలకు, కీలక నాయకులకు అప్పగిస్తుంది. 2026 చివరి నాటికి లేదా 2027 మొదట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండవచ్చు. అందుకే ఇప్పటినుంచే క్షేత్రస్థాయిలో పార్టీలను బలోపేతం చేయడమే కాకుండా, అభ్యర్థులు ఎవరో ముందుగానే ఖరారు చేసుకుని ముందుకు వెళ్లాలని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) భేటీ అయి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలో ఎప్పటినుంచే ఓ ప్రణాళిక రచించుకోవాలని సూచించినట్లు సమాచారం.
అలాగే తెలుగుదేశం పార్టీ కూడా మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఈ విషయంలో స్పష్టమైన క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీని ఎదుర్కొనే విషయంలో తక్కువ అంచనా వేయకుండా ఎవరి రాజకీయం వాళ్ళు చేయాలని, ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇన్చార్జి మంత్రులను అడిగి ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచించినట్లు సమాచారం. రిజర్వేషన్ల విషయం పక్కనపెట్టి పార్టీలను బలోపేతం చేసే అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని కూడా చెప్పినట్లు సమాచారం. సామాజిక వర్గాల విషయంలో తక్కువ అంచనా వేయవద్దని.. అలాగే ఆర్థికంగా బలంగా లేరని నాయకులను తక్కువ అంచనా వేయవద్దని కూటమి పెద్దలు చెప్పినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో గొడవలు ఉన్నా సరే వాటిని పరిష్కరించుకునే దిశగానే అడుగులు వేయాల్సిన అవసరం ఉందని.. కూటమిలో విభేదాలు ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇన్చార్జి మంత్రులకు ఉందని ఇటీవల సీఎం చంద్రబాబు(Chandrababu Naidu)తో పాటుగా, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చెప్పినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి.













