Vijay Rashmika: సోషల్ మీడియాలో వైరలవుతున్న విజయ్- రష్మిక వెడ్డింగ్ కార్డు
టాలీవుడ్లో రౌడీ హీరోగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ(vijay devarakonda), నేషనల్ క్రష్‌గా అభిమానులను సంపాదించుకున్న రష్మిక మందన్నా(rashmika Mandanna) పెళ్లి చేసుకోబోతున్నారనే సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నెల 26న వీరిద్దరి పెళ్లి జరగనున్నట్లు వార్తలు వస్తుండగా, తాజాగా సోషల్ మీడియాలో ఒక వెడ్డింగ్ కార్డు వైరల్ అవుతోంది. అందులో మార్చి 4న రాత్రి 7 గంటలకు హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో రిసెప్షన్ నిర్వహించనున్నట్లు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక సాదాసీదాగా జరగనుందని ప్రచారం జరుగుతోంది.
విజయ్, రష్మిక జోడీ తొలిసారిగా 2018లో రిలీజైన గీత గోవిందం(geetha govindam) మూవీలో కలిసి నటించారు. ఈ సినిమాలో వారి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. గీత గోవిందం సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారిందనే వార్తలు అప్పట్లోనే వినిపించాయి. ఆ తరువాత 2019లో వచ్చిన డియర్ కామ్రేడ్(dear comrade) లో మళ్లీ కలిసి నటించిన ఈ జంట, తమ నటనతో మరింత ప్రశంసలు అందుకుంది. ఆ సమయంలో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారన్న రూమర్స్ సినీ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి.
ఇప్పటికే ఇద్దరూ తమ తమ కెరీర్లో పలు విజయాలను అందుకున్నారు. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలపై మాత్రం వారు ఇప్పటివరకు స్పందించలేదు. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్(Udaypur) ప్యాలెస్ లో విజయ్, రష్మికల పెళ్లి జరగనుందని తెలుస్తోంది. పెళ్లికి అతి తక్కువ మంది మాత్రమే హాజరవనున్నట్టు తెలుస్తోంది.













