Silicon Andhra: సిలికానాంధ్ర సిల్వర్ జూబ్లీ వేడుకల తేదీలు ఖరారు.. కాలిఫోర్నియా వేదికగా త్వరలో ఘనంగా సంబరాలు
సిలికానాంధ్ర జగమంత కుటుంబం 25 ఏళ్ళ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది. అమెరికాలోని కాలిఫోర్నియా, ఓక్ ల్యాండ్లో ఆగస్టు 08, 2026, శనివారం రోజు ఈ కార్యక్రమానికి జరపనున్నారు. గత 25 ఏళ్ల కాలంగా తెలుగు సంస్కృతి, భాషా పరిరక్షణకు కట్టుబడి ఉన్న ఈ సంస్థ, ప్రవాస తెలుగు వారిని తమ మూలాలతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ మైలురాయిని పురస్కరించుకుని భారతీయ, తెలుగు సంస్కృతీ వైభవాన్ని చాటిచెప్పేలా అనేక ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది.
సంగీతామృత వర్షిణి (SangeetAmruta Varshini)
కర్ణాటక సంగీత విద్వాంసుల కోసం పంచరత్న మాలిక అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. అన్నమయ్య, క్షేత్రయ్య, రామదాసు, త్యాగరాజు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి ఐదుగురు దిగ్గజ వాగ్గేయకారుల కీర్తనలను ఈ విభాగంలో ఆలపిస్తారు.
లయామృత వర్షిణి (LayAmruta Varshini)
మృదంగ విద్వాంసుల కలయికతో సుమారు 300 మంది కళాకారులతో సింఫనీ ఆఫ్ పర్కషన్ నిర్వహించనున్నారు. పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో దేవవాద్యమైన మృదంగం ఘోషను ఈ కచేరీలో ఆస్వాదించవచ్చు.
కూచిపూడి నృత్యామృత వర్షిణి (Kuchipudi NatyAmruta Varshini)
సిలికాన్ ఆంధ్ర వైజయంతి మహాబృంద నాట్యం పేరుతో వందలాది మంది కూచిపూడి కళాకారులు పాల్గొనే భారీ ప్రదర్శనను ఈ వేడుకల్లో భాగంగా ప్రదర్శించనున్నారు.
లలిత గీతామృత వర్షిణి (Lalita GeetAmruta Varshini)
పాలగుమ్మి, బాలాంత్రపు వంటి ప్రముఖ రచయితల గీతాలను సుమారు 300 మంది గాయకులు రామచారి నేతృత్వంలో ఆలపించి ప్రేక్షకులను అలరించనున్నారు.
శతక శంఖారావం (Sataka Sankharavam)
వేమన, సుమతీ శతకాలలోని 18 పద్యాలను 1,800 మంది ప్రతినిధులతో సామూహికంగా పఠనం చేయించడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించేందుకు సిలికానాంధ్ర సిద్ధమైంది.
జానపద జాతర (Janapada Jathara)
తెలుగు గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టేలా డప్పు, లంబాడి, పులివేషాలు, కొమ్ముకోయ, గొండు, గుస్సాడీ వంటి వైవిధ్యమైన జానపద కళారూపాలను ఈ జాతరలో ప్రదర్శించనున్నారు.
వందే భారతం (Vande Bharatam)
భారతదేశ విశిష్టతను, ప్రాచీన వైభవాన్ని చాటిచెప్పేలా సెమీ క్లాసికల్, ఆధునిక నృత్య సమ్మేళనాన్ని ఈ విభాగంలో చూడవచ్చు.
వెండితెర వైభవం (Venditera Vaibhavam)
అంతర్జాతీయ తెలుగు లఘు చిత్రాల పోటీని కూడా నిర్వహిస్తున్నారు. 21 ఏళ్ళ పైబడిన వారు స్మార్ట్ ఫోన్ లేదా ప్రొఫెషనల్ కెమెరాల ద్వారా తెలుగు సంస్కృతి, కళలను ప్రతిబింబించే చిత్రాలను ఇక్కడ ప్రదర్శించవచ్చు.
సామాజిక ప్రభావం (Community Impact)
గత 25 సంవత్సరాలుగా సిలికానాంధ్ర ఒక స్వచ్ఛంద సంస్థగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఏకం చేస్తూ సంస్కృతీ పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తోంది. ఈ చారిత్రక వేడుకల్లో ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనాలని నిర్వాహకులు కోరుతున్నారు.
మరింత సమాచారం, రిజిస్ట్రేషన్ కోసం..
ఇమెయిల్: silverjubilee@siliconandhra.org
ఫోన్: 1 877 LUV SASJ (1 877 588 7275)
వెబ్ సైట్: silverjubilee.siliconandhra.org













