ENG vs SCO: వరల్డ్ కప్‌లో యూరప్ దేశంపై ఇంగ్లండ్ తొలి విక్టరీ..!
టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో ఇంగ్లండ్ (ENGvsSCO) జట్టు అదరగొట్టింది. గ్రూప్-సిలో భాగంగా కోల్‌కతా వేదికగా మరో యూరప్ దేశం స్కాట్లాండ్తో జరిగిన పోరులో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒక యూరోపియన్ జట్టుపై ఇంగ్లండ్‌కు ఇదే తొలి గెలుపు కావడం విశేషం. గతంలో నెదర్లాండ్స్, ఐర్లాండ్ జట్ల చేతిలో అనూహ్య పరాజయాలు పాలైన ఇంగ్లండ్.. ఈ తాజా గెలుపుతో ఆ దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ తమ చెత్త రికార్డును చెరిపేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. ఇంగ్లండ్ (ENGvsSCO) బౌలర్ల పకడ్బందీ వ్యూహాల ముందు నిలబడలేక 19.4 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో రిచీ బెరింగ్టన్ (49), మైకేల్ జోన్స్ (33) మినహా మిగతా బ్యాటర్లెవరూ పెద్దగా రాణించలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టార్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ మూడు వికెట్లతో చెలరేగగా, పేసర్ జోఫ్రా ఆర్చర్, డాసన్ తలో రెండు వికెట్లు పడగొట్టి స్కాట్లాండ్ను కట్టడి చేశారు.
అనంతరం 153 పరుగుల మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ (ENGvsSCO).. 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి సునాయాసంగా గెలుపొందింది. ఇంగ్లండ్ ఛేదనలో ఓపెనర్ టామ్ బాంటన్ హీరోగా నిలిచాడు. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడిన బాంటన్.. కేవలం 41 బంతుల్లోనే 63 పరుగులు సాధించి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతనికి మిడిలార్డర్లో జేక్ బెథెల్ (32), సామ్ కర్రన్ (28) నుంచి చక్కటి సహకారం లభించింది. ఆద్యంతం ఆధిపత్యం చెలాయించిన ఇంగ్లండ్ (ENGvsSCO).. ఈ అద్భుత విజయంతో గ్రూప్-సి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.













