Revanth Reddy: ‘హంగ్’లపై సీఎం రేవంత్ పక్కా స్కెచ్!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వేడిని రగిల్చాయి. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని చాటుకున్నప్పటికీ, సుమారు 36 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని హంగ్ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో, ఏ ఒక్క పురపాలిక కూడా చేజారిపోకూడదని, అక్కడ కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. ఈ మేరకు ఇన్ఛార్జ్ మంత్రులకు ఆయన అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నుంచి ఫలితాల అనంతరం పాలకవర్గాల ఏర్పాటు వరకు పూర్తి బాధ్యతను రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రులపైనే పెట్టారు. “మున్సిపాలిటీల్లో గెలుపు బాధ్యత మీదే.. హంగ్ ఏర్పడిన చోట వ్యూహాత్మకంగా వ్యవహరించి మేయర్, చైర్మన్ పీఠాలను కైవసం చేసుకోవాలి” అని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఎన్నికల్లో గెలవడమే కాదు, ఇతర పార్టీల నుంచి గెలిచిన స్వతంత్ర అభ్యర్థులు, భావసారూప్యత కలిగిన పార్టీల మద్దతు కూడగట్టడంలో మంత్రులదే కీలక పాత్ర అని సీఎం నిర్దేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా హంగ్ ఏర్పడిన 36 పట్టణ స్థానిక సంస్థల్లో కనీసం 20కి పైగా చోట్ల కాంగ్రెస్ పీఠం దక్కించుకునే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ఆయన జిల్లా వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. కొత్తగూడెంలో కాంగ్రెస్, సీపీఐ మధ్య ప్రతిష్టంభన నెలకొంది. దీనిని సామరస్యంగా పరిష్కరించి స్థిరమైన పాలకవర్గాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పగించారు. నిజామాబాద్ కార్పొరేషన్లో పట్టు సాధించేందుకు సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. కరీంనగర్ కార్పొరేషన్లో ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులతో చర్చలు జరిపి కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేలా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లకు బాధ్యతలు ఇచ్చారు. జగిత్యాలలో రెబల్ అభ్యర్థుల బెడదను చక్కదిద్ది పార్టీని లైన్లోకి తెచ్చే బాధ్యతను స్థానిక మంత్రులకు అప్పగించారు. ఎన్నికల ఫలితాల్లో కీలక పాత్ర పోషిస్తున్న స్వతంత్ర అభ్యర్థులు, కాంగ్రెస్ రెబల్స్ ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకునే ఎవరినైనా కలుపుకుని పోవాలని మంత్రులకు సూచించారు. స్థానిక నాయకత్వం మధ్య సమన్వయం లోపిస్తే ఫలితం తారుమారయ్యే ప్రమాదం ఉందని, కాబట్టి వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ రెడ్డి గట్టిగా హెచ్చరించారు.
మున్సిపల్ ఫలితాలను ముఖ్యమంత్రి తన కేబినెట్ సహచరుల పనితీరుకు కొలమానంగా భావిస్తున్నారు. తన నియోజకవర్గంలో లేదా తాను ఇన్ఛార్జ్గా ఉన్న జిల్లాలో పార్టీని గెలిపించుకోలేకపోతే భవిష్యత్తులో రాజకీయంగా నష్టపోయే ప్రమాదం ఉందని మంత్రులకు పరోక్షంగా హెచ్చరికలు పంపారు. గతంలోనే ఆయన “పని చేసే వారికే పదవులు.. మున్సిపల్ గెలవకపోతే పదవి గోవిందా” అనే తరహాలో వ్యాఖ్యానించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మెజారిటీ మున్సిపల్ పీఠాలను దక్కించుకోవడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగుతోందని నిరూపించాలనేది రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్. హంగ్ ఏర్పడిన చోట మంత్రులు ఏ మేరకు సమన్వయంతో వ్యవహరిస్తారు, సీఎం వ్యూహాన్ని ఎలా అమలు చేస్తారనేది రాబోయే కొద్ది రోజుల్లో తేలిపోనుంది. ఏది ఏమైనా, రేవంత్ రెడ్డి దూకుడు చూస్తుంటే మున్సిపల్ పీఠాల దక్కించుకునే విషయంలో ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదని స్పష్టమవుతోంది.













