Telangana: పొత్తు లేకపోతే కమలం కష్టమేనా..?
దాదాపు గత ఆరేళ్ల నుంచి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ(BJP) బలోపేతం అవుతుంది అంటూ ఆ పార్టీ నాయకత్వం చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే గెలుచుకుని ఆ మరుసటి ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఏకంగా నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుంది ఆ పార్టీ. 2023 ఎన్నికల్లో అసెంబ్లీలో పర్వాలేదు అనిపించిన బిజెపి ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా ఎనిమిది స్థానాలు గెలుచుకుంది. దీంతో ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి(BRS)కి ఊహించని దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఇక ఆ తర్వాత నుంచి భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోతోంది.
ఇవి కూడా చదవండి
గత ఏడాది జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ.. కనీసం ప్రభావం చూపించలేదు. ఇక పంచాయతీ ఎన్నికల్లో కూడా పార్టీకి ప్రజలనుంచి మద్దతు కరువైంది. పార్టీ నాయకులు మాటలు చెప్పడమే మినహా బలోపేతం చేయలేకపోతున్నారనేది ఆ పార్టీ కేడర్ ఆవేదన. మున్సిపల్ ఎన్నికల్లో కూడా పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేదు. కనీసం తమ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నచోట కూడా పార్టీ మున్సిపల్ స్థానాలను కైవసం చేసుకోలేకపోయింది. అయితే ఇప్పుడు.. బిజెపికి రాజకీయ పరిశీలకులు సూచనలు చేస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావాలంటే పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లడం మినహా ఆ పార్టీకి మరో మార్గం లేదని.. దీనిపై అధిష్టానం కసరత్తు చేయాలని సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఫార్ములాను తెలంగాణలో కూడా అమలు చేస్తేనే ఆ పార్టీ సత్తా చాటే అవకాశం ఉంటుందని.. స్థానిక సంస్థల్లో పట్టు లేనప్పుడు ఎంపీ స్థానాలు గెలిచిన పార్టీ బలోపేతం కావడం కష్టం అంటూ హెచ్చరిస్తున్నారు పరిశీలకులు. నాయకులు విమర్శలకు మాత్రమే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును వీలైనంత త్వరగా తమ వైపుకు తిప్పుకోకపోతే పార్టీ మరింతగా బలహీనపడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోకుండా బిజెపి ముందుకు వెళ్ళవద్దని.. కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయడం కరెక్ట్ కాదంటూ అభిప్రాయపడుతున్నారు. జనసేన(Janasena) పార్టీతో కలిసి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే మంచి ఫలితాలు వచ్చేవని ఆ పార్టీ నాయకత్వానికి పలువురు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి













