ENGvsSCO: స్కాట్లాండ్తో ఇంగ్లండ్ ఢీ.. మరో అప్సెట్ ఖాయమా..?
టీ20 ప్రపంచకప్ 2026 సమరంలో మరో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్-సిలో భాగంగా జరగనున్న 23వ మ్యాచ్‌లో పొరుగు దేశాలైన ఇంగ్లండ్, స్కాట్లాండ్ (ENGvsSCO) జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. తాజాగా ఆసీస్‌కు జింబాబ్వే షాకిచ్చిన నేపథ్యంలో.. తడబడుతున్న ఇంగ్లండ్‌పై తాము కూడా నెగ్గి మరో అప్సెట్ ఇవ్వాలని స్కాట్లాండ్ కసిగా ఉంది. కాగితంపై చూస్తే ఇంగ్లండ్ జట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ, పొట్టి ఫార్మాట్లో ఏ జట్టునైనా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. దానికితోడు ఇంగ్లండ్ జట్టు ఫామ్ కూడా కొంత ఆందోళనకరంగా ఉంది. తాజాగా వెస్టిండీస్ చేతిలో ఇంగ్లండ్ దారుణంగా ఓడిన సంగతి తెలిసిందే.
హ్యారీ బ్రూక్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతమైన సమతుల్యతతో ఉంది. ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, జాకబ్ బెథెల్ వంటి విధ్వంసకర బ్యాటర్లు, జోఫ్రా ఆర్చర్ వంటి ప్రమాదకరమైన పేసర్లతోపాటు అదిల్ రషీద్, విల్ జాక్స్ వంటి స్పిన్నర్లతో ఆ జట్టు భారీ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు స్కాట్లాండ్ (ENGvsSCO) కూడా సంచలనాలు సృష్టించేందుకు ఉవ్విళ్లూరుతోంది. గత ఐసీసీ టోర్నీల్లో పలు అగ్రశ్రేణి జట్లకు షాకిచ్చిన చరిత్ర ఆ జట్టుకు ఉంది. రిచీ బెరింగ్టన్ నేతృత్వంలోని స్కాట్లాండ్.. ఇంగ్లండ్‌పై అద్భుత ప్రదర్శన చేసి ప్రపంచ క్రికెట్లో తమ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.
ఇంగ్లండ్ (ENGvsSCO) తమ ఆధిపత్యాన్ని చెలాయించి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తుండగా.. స్కాట్లాండ్ మాత్రం అద్భుతం చేసి టోర్నీలో సంచలనం సృష్టించాలని తహతహలాడుతోంది. డేవిడ్ వర్సెస్ గోలియత్ తరహాలో సాగనున్న ఈ పోరులో ఇంగ్లండ్ పవర్‌హిట్టర్ల ధాటిని స్కాట్లాండ్ బౌలర్లు ఎలా నిలువరిస్తారనేది ఆసక్తికరం.













