Ahaan Pandey: టీరా బ్రాండ్ అంబాసిడర్‌గా అహాన్ పాండే
రిలయన్స్ రిటైల్ విభాగానికి చెందిన ప్రముఖ బ్యూటీ బ్రాండ్ ‘టీరా’ (Tira) సౌందర్య సాధనాల మార్కెట్లో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. బ్యూటీ ప్రొడక్ట్స్ ప్రచారం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది హీరోయిన్లు లేదా మహిళా మోడల్స్ మాత్రమే. కానీ ఏళ్ల నాటి ఈ సాంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ, బాలీవుడ్ యువ నటుడు అహాన్ పాండేను (Ahaan Pandey) తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించి టీరా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక ప్రముఖ బ్యూటీ రిటైల్ సంస్థ ఇలా ఒక పురుష సెలబ్రిటీని తమ ప్రచారకర్తగా ఎంచుకోవడం పరిశ్రమలో ఇదే తొలిసారి కావడం విశేషం.
ఇప్పటికే టీరా బ్రాండ్‌కు బాలీవుడ్ స్టార్ నటీమణులు కరీనా కపూర్, కియారా అడ్వాణీ, సుహానా ఖాన్లు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ అగ్రశ్రేణి తారల జాబితాలోకి అహాన్ పాండే (Ahaan Pandey) కూడా అడుగుపెట్టాడు. ఈ సరికొత్త నియామకం సందర్భంగా టీరా ఒక ప్రత్యేకమైన ప్రచార కార్యక్రమాన్ని (క్యాంపెయిన్) కూడా ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్ ద్వారా ఒక అర్థవంతమైన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతోంది. అందం అంటే కేవలం పైకి కనిపించే ఆకర్షణీయమైన బాహ్య రూపం మాత్రమే కాదని టీరా స్పష్టం చేస్తోంది. ఒక వ్యక్తి దైనందిన జీవితంలోని భావోద్వేగాలు, వారు ఎదుర్కొనే వివిధ సందర్భాలు, వారి అంతర్గత వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఒక మధురమైన వ్యక్తిగత అనుభవమే నిజమైన అందం అని నిర్వచించింది.













