Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కచ్చితంగా ఇవి తెలుసుకోండి!
ఆరోగ్యమే మహాభాగ్యం.. అందుకే ప్రస్తుత రోజుల్లో అనూహ్యంగా ఎదురయ్యే భారీ వైద్య ఖర్చుల నుంచి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా (Health Insurance) తీసుకుంటున్నారు. పాలసీ ఉంటే ఆసుపత్రికి వెళ్లినప్పుడు జేబులోంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదని చాలామంది అపోహ పడుతుంటారు. కానీ వాస్తవానికి ప్రతి ఆరోగ్య బీమా పాలసీలోనూ కొన్ని కఠినమైన మినహాయింపులు (ఎక్స్క్లూజన్స్) ఉంటాయి. ఐఆర్డీఏఐ మార్గదర్శకాల ప్రకారం.. ఏయే చికిత్సలకు, వ్యాధులకు బీమా వర్తించదో పాలసీదారులు ముందుగానే తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.
సాధారణంగా ఏ ఆరోగ్య బీమా (Health Insurance) తీసుకున్నా తక్షణమే పూర్తి స్థాయి కవరేజ్ లభించదు. దీనికి ‘వెయిటింగ్ పీరియడ్’ నిబంధన ఉంటుంది. పాలసీ తీసుకున్న మొదటి 30 రోజుల నుంచి కొన్ని నిర్దిష్ట వ్యాధులకు ఒకటి లేదా రెండు ఏళ్ల వరకు ఈ నిరీక్షణ సమయం వర్తిస్తుంది. ఈ వ్యవధిలో కేవలం ప్రమాదవశాత్తు జరిగే గాయాలకు మాత్రమే కంపెనీలు క్లెయిమ్ ఇస్తాయి. అలాగే ఆసుపత్రిలో చేరినప్పుడు వాడే సూదులు, కాటన్, పీపీఈ కిట్లు, గ్లౌజులు, శానిటైజర్లు వంటి వైద్యేతర ఖర్చులను ప్రాథమిక పాలసీలు కవర్ చేయవు. డాక్టర్ కన్సల్టేషన్ ఫీజులు, మందులు, డయాగ్నస్టిక్ పరీక్షలు వంటి ఓపీడీ ఖర్చులు కూడా దీని పరిధిలోకి రావు. గర్భధారణ, ప్రసవ ఖర్చులు, గర్భస్రావం లాంటివి సాధారణ పాలసీలో కవర్ కావు. ప్రమాదం వల్ల అయితే తప్ప సాధారణ దంత, కంటి చికిత్సలకు, కాంటాక్ట్ లెన్సులకు బీమా (Health Insurance) వర్తించదు. ఊబకాయం తగ్గించుకునే బేరియాట్రిక్ సర్జరీలు, సంతానలేమి (ఐవీఎఫ్, కృత్రిమ గర్భధారణ) చికిత్సలను కూడా బీమా కంపెనీలు భరించవు. అయితే వీటికి పరిష్కారం ఉంది. పాలసీ తీసుకునేటప్పుడే అదనపు ప్రీమియం చెల్లించి మెటర్నిటీ కవర్, ఓపీడీ రైడర్, కన్జ్యూమబుల్స్ కవర్ వంటి ప్రత్యేక ‘యాడ్-ఆన్’లను ఎంచుకోవడం ద్వారా ఈ తరహా ఖర్చులన్నింటినీ కవర్ చేసుకోవచ్చు.
అయితే కొన్ని రకాల చికిత్సలు, పరిస్థితులకు మాత్రం ఆరోగ్య బీమాలో (Health Insurance) శాశ్వత మినహాయింపు ఉంటుంది. ఎంత అదనపు ప్రీమియం చెల్లించినా వీటికి క్లెయిమ్ రాదు. అందం కోసం చేయించుకునే కాస్మెటిక్, ప్లాస్టిక్ సర్జరీలకు, మెడికల్ కౌన్సిల్ గుర్తింపు లేని వైద్యుల వద్ద తీసుకునే చికిత్సలకు కవరేజ్ ఉండదు. ఆక్యుపంక్చర్, ప్రకృతి వైద్యం వంటివి కూడా పరిగణనలోకి రావు. సిఫిలిస్ లాంటి లైంగిక వ్యాధులు, మద్యం లేదా డ్రగ్స్ వాడకం వల్ల వచ్చే అనారోగ్యాలు, ఉద్దేశపూర్వకంగా చేసుకునే ఆత్మహత్యాయత్నం గాయాలకు ఎలాంటి పరిహారం దక్కదు. నేరపూరిత చర్యల్లో పాల్గొన్నప్పుడు తగిలే గాయాలు, రాక్ క్లైంబింగ్, స్కూబా డైవింగ్, మోటార్ రేసింగ్ వంటి ప్రమాదకరమైన సాహస క్రీడల వల్ల ప్రాణాపాయం కలిగినా బీమా (Health Insurance) క్లెయిమ్ తిరస్కరిస్తారు. యుద్ధ సమయాల్లో తగిలే గాయాలతో పాటు హెపటైటిస్ బి, మూర్ఛ, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, పార్కిన్సన్స్ వంటి వ్యాధులకు కూడా మినహాయింపులు ఉంటాయి. కాబట్టి పాలసీ కొనుగోలు చేసే ముందే పాలసీ పత్రంలోని మినహాయింపుల జాబితాను పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి.













