YCP: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆంధ్రపై ప్రభావం చూపుతాయా?
తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) తన రాజకీయ బలాన్ని స్పష్టంగా చూపించింది. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ మునిసిపల్ ఎన్నికల్లోనూ తన ప్రభావాన్ని ప్రదర్శించింది. దీనివల్ల విపక్షాలు వెనుకడిపోయాయి. అయినప్పటికీ, బీఎర్ఎస్ (BRS) కొన్ని మున్సిపాలిటీలను గెలిచి రేసులో ఉన్నత స్థాయిని నిరూపించింది. అధికారంలో ఉన్న పార్టీలతో పోరు సులభం కాదు. బీఎర్ఎస్ 15 వరకు మున్సిపాలిటీలను గెలిచిన విషయం రాజకీయవేత్తలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాగే, 700కి పైగా వార్డులను కూడా తన కవర్లోకి తీసుకుంది.
తెలంగాణా ,ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు ఒకదానిపై ఒకటి ప్రభావం చూపిస్తాయి అన్నది అందరికీ తెలిసిందే. తెలంగాణలో 2023లో కేసీఆర్ (K. Chandrashekar Rao) ఓటమి పాలయ్యారు. అదే విధంగా, ఆంధ్రప్రదేశ్లో 2024లో వైసీపీ ఓటమి ఎదుర్కొంది. ఉప ఎన్నికల్లో , లోకల్ బాడీ ఎన్నికల్లో వరుస ఓటములు బీఎర్ఎస్ పై ప్రభావం చూపుతున్నాయి. అలాగే, ఆంధ్రప్రదేశ్లోని పులివెందులలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అప్రతిహత విజయం సాధించింది. దాంతో, మరో జెడ్పీటీసీ స్థానాన్ని కూడా సొంతం చేసుకుంది.
అయితే ఇక్కడ ఈ రెండు పార్టీల మధ్య చాలా వ్యత్యాసం గమనించవచ్చు.తెలంగాణలో బీఎర్ఎస్ తన స్థిరమైన రాజకీయ ఆధిపత్యంతో బలంగా ఉంది. పార్టీకి కేసీఆర్ వంటి నాయకత్వం, అలాగే కేటీఆర్ (K.T. Rama Rao), హరీష్ రావు (Harish Rao) వంటి జంట నాయకత్వాలు ఉన్నాయి. మాజీ మంత్రులు ,సీనియర్ నేతలు కూడా ప్రజల మధ్య పార్టీ స్థిరత్వాన్ని నిలుపుతున్నారు. కాంగ్రెస్ ఘనమైన విజయాలు సాధించినప్పటికీ, బీఎర్ఎస్ ప్రజలకు మరోసారి పట్టం కట్టడంలో కష్టపడలేదు.
వీటితో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ బలహీనంగా ఉంది. ఒకే నాయకత్వం ఆధారంగా పార్టీ నడుస్తోంది. అసెంబ్లీలో విపక్ష హోదా లేకపోవడం, సభ్యుల సంఖ్య తక్కువగా ఉండడం, వ్యూహాల లోపం, పార్టీ నేతల సక్రియత లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. పైగా పార్టీకి సీనియర్ల అండ అంతంత మాత్రం గానే ఉంది. ఏకపక్ష నిర్ణయాలు ఇప్పటికే పార్టీని బాగా బలహీనపరిచాయి.
ఈ నేపధ్యంలో, ఆంధ్రప్రదేశ్లో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఎవరిదే అన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో మూడు పార్టీల కూటమి బలంగా ఉండటం, అధికారంలో ఉన్న పార్టీకి ప్రజలు ఎక్కువ మద్దతు ఇవ్వడం, వైసీపీకి పెద్ద వ్యూహాలతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని రాజకీయవేత్తలు అంటున్నారు. గట్టి వ్యూహాల ద్వారా మాత్రమే వైసీపీ పుర పోరులో నిలిచి గెలవగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ అటువంటి ఆలోచన పార్టీ అధినేతలో కానీ.. పార్టీ క్యాడర్లో కానీ ఎక్కడ కనిపించడం లేదు.













