Riyan Parag: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్!
ఐపీఎల్ 2026 సీజన్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ రాజస్థాన్ రాయల్స్ (RR) ఫ్రాంచైజీ ఒక ఆసక్తికరమైన, సంచలన నిర్ణయం తీసుకుంది. జట్టు నూతన సారథిగా యువ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్‌ను (Riyan Parag) నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత సీజన్లో జట్టును నడిపించిన సంజూ శాంసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌తో ట్రేడ్ చేసుకున్న తర్వాత, రాజస్థాన్ పగ్గాలు ఎవరు చేపడతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా వెటరన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి సొంతగూటికి (రాజస్థాన్ రాయల్స్) చేరడంతో, అనుభవం రీత్యా అతనికే కెప్టెన్సీ పగ్గాలు దక్కుతాయని క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు గట్టిగా భావించారు. కానీ యాజమాన్యం మాత్రం సీనియారిటీ కంటే యువ రక్తానికే ఓటు వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
2019లో రాజస్థాన్ రాయల్స్‌తోనే ఐపీఎల్లో అరంగేట్రం చేసిన రియాన్ పరాగ్ (Riyan Parag).. అప్పటి నుంచి ఆ జట్టుతోనే కొనసాగుతూ నమ్మకమైన ఆటగాడిగా ఎదిగాడు. గతంలో సంజూ శాంసన్ గాయపడిన సమయంలో తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం కూడా పరాగ్‌కు ఉంది. ఆ సమయంలో 8 మ్యాచ్‌లకు నాయకత్వం వహించగా, కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించి, ఆరు మ్యాచ్‌లలో ఓటమి చవిచూశాడు. ఆ రికార్డు అంత గొప్పగా లేకపోయినప్పటికీ, ఫ్రాంచైజీ అతని (Riyan Parag) నాయకత్వ పటిమపై నమ్మకం ఉంచింది. ఈ నియామకంపై పరాగ్ స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ తనకు సొంత ఇల్లు లాంటిదని, తన కెరీర్ ఆరంభం నుండి ఎన్నో విమర్శలు, ఒడిదుడుకులు ఎదురైనా ఫ్రాంచైజీ తనకు అండగా నిలిచిందని గుర్తుచేసుకున్నాడు. ఒక ఆటగాడిగా తన ఎదుగుదలకు కారణం ఆర్ఆర్ యాజమాన్యమేనని, వారి నమ్మకాన్ని వమ్ము చేయనని తెలిపాడు.













