TANA: హరికరసాని కుటుంబసభ్యులతో కృష్ణ ప్రసాద్ సోంపల్లి భేటీ..
హరి ఆచూకికై తానా చేస్తున్న చర్యల వివరణ
హ్యూస్టన్‌లో నివసిస్తున్న ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన కరసాని హరి డిసెంబర్ 22న అలాస్కా పర్యటనకు వెళ్ళి అదృశ్యమైన సంగతి తెలిసిందే. హరి ఆచూకికోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నాయకులు చేస్తున్న అన్వేషణ వివరాలను తానా ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ కృష్ణ ప్రసాద్ సోంపల్లి హరి తల్లితండ్రులకు, బంధువులకు వివరించారు. తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, అంతర్జాతీయ విద్యార్థుల సమన్వయకర్త డాక్టర్ ఉమా.ఆర్. కటికి సూచన మేరకు సంతమాగులూరులో నివసిస్తున్న హరి కుటుంబాన్ని ప్రసాద్ సోంపల్లి సందర్శించారు. హరి రెడ్డి తల్లిదండ్రులను మరియు అతని సన్నిహితులను కలిశారు, తానా ప్రతి సంవత్సరం అనేక కేసులను పరిష్కరిస్తోందని, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సహాయం చేస్తుంటుందని, కానీ ఈ కేసు ప్రత్యేకమైనది కావడంతో తాము అన్ని విధాలుగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాస్కాలో ముఖ్యంగా అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు వాతావరణ పరిస్థితులు అధ్వాన్నంగా ఉంటాయని తెలిపారు.

అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన శ్రీ కోమటి జయరాం సహాయంతో, ఎపి ప్రభుత్వం అమెరికా మరియు అలాస్కా ప్రభుత్వానికి ఈ అన్వేషణలో సహాయపడమని సిఫార్సు లేఖలను జారీ చేసిందని చెప్పారు. విదేశాల్లో నివసిస్తున్న తమవారికోసం, తల్లితండ్రులు, విద్యార్థులు తమ ప్రియమైన వ్యక్తిని ట్రాక్ చేయడంలో టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆపిల్ ప్రొడక్ట్ ఎయిర్‌ట్యాగ్ స్పెషాలిటీ గురించి లోతుగా వివరించారు. హరి రెడ్డి కరసాని ఆచూకి దొరికేంతవరకు అలాస్కా ప్రభుత్వ కృషి ఆగదని చెప్పారు.
అమెరికాలో నివసిస్తున్న తమ ప్రియమైన వారి పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలని ఆయన తల్లిదండ్రులను కోరారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లలతో ప్రతిరోజూ మాట్లాడాలని అంటూ, అదే విధంగా అమెరికాలో వారు కూడా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమ తల్లితండ్రులతో, బంధువులతో రోజూ మాట్లాడుతూనే ఉండాలని కోరారు.
తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరిస్తూ, అమెరికాలో ఉన్నవారు ఏదైనా సలహా కావాల్సినవారు 1-855-687-8262, లేదా 855-OUR-TANA కు కాల్ చేయాలని కోరారు.













