Team India: హార్దిక్ ఆల్‌రౌండ్ షో.. నమీబియాపై ఇండియా భారీ విక్టరీ
టీ20 ప్రపంచకప్ వేటలో టీమిండియా (Team India) మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో పసికూన నమీబియాను చిత్తు చేసి, మెగాటోర్నీలో వరుసగా రెండో గెలుపును సొంతం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆధిపత్యం ప్రదర్శించిన భారత్, ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఏకపక్ష విజయాన్ని సాధించింది. అనారోగ్యం కారణంగా ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరమవడంతో, అతని స్థానంలో వచ్చిన సంజూ శాంసన్ (22) ఇషాన్ కిషన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. వీరిద్దరూ శుభారంభం అందించగా, ఇషాన్ కిషన్ (61) అర్ధశతకంతో మెరిశాడు. మధ్యలో వికెట్లు పడి స్కోరు వేగం తగ్గినప్పటికీ హార్దిక్ పాండ్యా (52) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. శివమ్ దూబే (23) కూడా బ్యాట్ ఝుళిపించడంతో భారత్ (Team India) నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. నమీబియా బౌలర్లలో కెప్టెన్ ఎరాస్మస్ 4 వికెట్లతో రాణించాడు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అనంతరం 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియాకు ఆరంభం బాగున్నా, భారత బౌలర్ల ధాటికి అది ఎంతోసేపు నిలవలేదు. లారెన్ స్టీన్కాంప్, జాన్ ఫ్రైలింక్ మినహా మిగతా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ముఖ్యంగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (3 వికెట్లు) తన స్పిన్ మాయాజాలంతో నమీబియా నడ్డివిరిచాడు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని 116 పరుగులకే కుప్పకూల్చారు. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ అదరగొట్టిన హార్దిక్ పాండ్యాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ గెలుపు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో భారత్ (Team India).. ఆదివారం దాయాది పాకిస్థాన్‌తో జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్‌కు సమాయత్తమవుతోంది.













