T20 World Cup: ఒమన్‌పై లంకేయుల సూపర్ విక్టరీ.. 105 పరుగుల తేడాతో విజయం!
శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup) ఆతిథ్య శ్రీలంక జట్టు తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. పసికూన ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో లంకేయులు ఆకాశమే హద్దుగా చెలరేగి 105 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని నమోదు చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు పాథుమ్ నిస్సంక (13), కమిల్ మిషారా (8) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. అయితే అనుభవజ్ఞుడైన కుశాల్ మెండిస్ (61) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నాడు. వికెట్ల పతనాన్ని అడ్డుకుంటూనే స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యువ సంచలనం పవన్ రత్నాయకే (60), కెప్టెన్ దాసున్ షనక (50) ఒమన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ పోటీపడి బౌండరీలు, సిక్సర్లు బాదడంతో స్టేడియం హోరెత్తిపోయింది. చివర్లో కామిందు మెండిస్ (19 నాటౌట్) మెరుపులతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరును సాధించింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ జట్టు.. శ్రీలంక బౌలింగ్ దాటికి ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఆరంభం నుండే వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. ఆ జట్టులో మహమ్మద్ నదీమ్ (53 నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా, వసీమ్ అలీ (27) ఫర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ రెండంకెల స్కోరు కూడా దాటలేక చేతులెత్తేశారు. శ్రీలంక బౌలర్లు దుష్మంత చమీర, మహీష్ తీక్షణ చెరో రెండు వికెట్లు తీసి ఒమన్ నడ్డివిరిచారు. దీంతో ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ ఏకపక్ష విజయంతో శ్రీలంక పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. హాఫ్ సెంచరీతో చెలరేగిన పవన్ రత్నాయకేకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.













