T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో హిస్టరీ.. ఇటలీకి తొలి విజయం..!
టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup) వేదికగా ఇటలీ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. మెగా టోర్నీలో పసికూనగా బరిలోకి దిగిన ఇటలీ, నేపాల్‌పై ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రపంచకప్ చరిత్రలో ఆ జట్టుకు ఇదే తొలి గెలుపు కావడం విశేషం. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇటలీ అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇటలీ నిర్ణయం సరైనదేనని వారి బౌలర్లు నిరూపించారు. నేపాల్ బ్యాటర్లను ఆరంభం నుంచే ఒత్తిడిలోకి నెట్టారు. నేపాల్ ఇన్నింగ్స్‌లో (T20 World Cup) నేపాల్ టీంలో ఆసిఫ్ షేక్ (20), కెప్టెన్ రోహిత్ పాడేల్ (23), దీపేంద్ర సింగ్ (17), ఆరిఫ్ షేక్ (27), కరణ్ కేసీ (18 నాటౌట్) వంటి వారు క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా, భారీ స్కోర్లు చేయలేకపోయారు. ఇటలీ బౌలర్ క్రిషన్ కలుగమగే మూడు వికెట్లతో నేపాల్ పతనాన్ని శాసించగా, బెన్ మానేంటి రెండు వికెట్లతో అతనికి సహకరించాడు. దీంతో నేపాల్ 19.3 ఓవర్లలో 123 పరుగులకే కుప్పకూలింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అనంతరం 124 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇటలీ, వికెట్లేమీ నష్టపోకుండానే ఆటను ముగించింది. ఓపెనర్లుగా వచ్చిన సోదరులు జస్టిన్ మోస్కా (60 నాటౌట్), ఆంథనీ మోస్కా (62 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. నేపాల్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మైదానం నలువైపులా షాట్లు బాదుతూ కేవలం 12.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. ఈ అద్భుత విజయంతో ఇటలీ శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. బౌలింగ్‌లో మెరిసిన కలుగమగేకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.













