YS Jagan: వంశీ విషయంలో జగన్ ఆలోచన ఏంటీ..?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్(Vallabhaneni Vamsi) రాజకీయ భవిష్యత్తు విషయంలో ఇప్పుడు ఆసక్తి నెలకొంది. 2019లో పార్టీ మారిన ఆయన.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ(TDP) విషయంలో అనుసరించిన వైఖరి ఇప్పుడు ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది అనే మాట వాస్తవం. ఇక ప్రస్తుతం వైసీపీలో ఉన్న వల్లభనేని వంశీ మోహన్.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే దానికి సంబంధించి స్పష్టత రావటం లేదు. జైలు నుంచి విడుదలైన తర్వాత, ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసిన వంశీ, మళ్లీ వెనక్కు తగ్గినట్లుగానే కనబడుతోంది.
అయితే గ్రామాల్లో ఆయనకు కొంత ఫాలోయింగ్ ఉండటంతో, వంశీ ప్రజల్లోకి వెళ్లాలని ఆ పార్టీ అధిష్టానం కూడా కోరుతున్నప్పటికీ వంశీ దూకుడు ప్రదర్శించడం లేదు. కేసులు భయం కారణంగా వంశీ వెనక్కు తగ్గుతున్నట్లుగా స్పష్టంగా అర్థం అవుతుంది. వచ్చే ఎన్నికల నాటికి గన్నవరం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలి అంటే.. కచ్చితంగా వంశీ ప్రజల్లోకి రావాలని, ఆ పార్టీ కార్యకర్తలు కూడా కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవాల్సిన అవసరం కూడా వంశీ పై ఉంది.
అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పై వచ్చే ఆరోపణల విషయంలో, కూడా వంశీ కాస్త దూకుడు ప్రదర్శించాలని ఆ పార్టీ నాయకత్వం కోరుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వంశీ బయటకు రావడానికి ఇష్టపడటం లేదు. దీనితో గన్నవరం నియోజకవర్గంలో, ఇన్చార్జిను మార్చాలనే ఆలోచనలో కూడా పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిస్థాయిలో కసరత్తు కూడా చేశారని, అయితే ఒకరిద్దరి నేతలు అధినేత వైఎస్ జగన్ వద్ద నియోజకవర్గ పరిస్థితిని ప్రస్తావించడంతోనే వెనక్కు తగ్గినట్లుగా తెలుస్తోంది.
వంశీ అరెస్టు విషయంలో గ్రామాల్లో కొంత సానుభూతి ఉంది అనే ప్రచారం కూడా ఉంది. దీనిని వంశీ వాడుకునే ప్రయత్నం కొంత చేసినప్పటికీ ఆ తర్వాత పరిస్థితులు సహకరించకపోవడంతో మళ్లీ సైలెంట్ అయిపోయారు. ఇక నియోజకవర్గంలో నాయకత్వాన్ని మారిస్తే, భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధిష్టానానికి ఇప్పటికే కొంతమంది చెప్పినట్లుగా వైసిపి వర్గాలు అంటున్నాయి. అందుకే వంశీ విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉందని సమాచారం.













