Whatsapp: వాట్సాప్ కు బిగ్ షాక్ ఇచ్చిన రష్యా..!
స్థానిక చట్టాలను పాటించడంలో మెటా సహా పలు సోషల్ మీడియా కంపెనీలు విఫలం అయ్యాయనే ఆరోపణల నేపధ్యంలో.. రష్యా(Russia) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెటా(Meta) ప్లాట్‌ఫామ్‌లకు చెందిన అమెరికా ఆధారిత మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌ను రష్యా పూర్తిగా బ్లాక్ చేసింది. అయితే తమ దేశంలో తయారు చేసిన MAX అనే యాప్ ను ప్రోత్సహించేందుకు రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ గురువారం ఈ నిర్ణయాన్ని ధృవీకరించారు.
మెటా నిబంధనలను పాటించకపోవడం వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. MAX అనేది అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయంగా ఆయన అభివర్ణించారు. వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా ఈ యాప్ అందుబాటులో ఉందని తెలిపారు. అయితే రష్యా తయారు చేసిన యాప్.. నిఘా సాధనం అనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణను రష్యన్ అధికారులు ఖండించారు. ఈ ప్లాట్‌ఫామ్ వివిధ ప్రభుత్వ సంబంధిత సేవలను అనుసంధానిస్తుందని, పౌరుల దైనందిన జీవితాలను సులభతరం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని అధికారులు చెబుతున్నారు.
వాట్సాప్ పై ఆరు నెలలుగా పెరుగుతున్న ఒత్తిడి నేపధ్యంలో.. ఈ చర్య హాట్ టాపిక్ అయింది. ఉక్రెయిన్ తో యుద్ద సమయంలో.. ఈ నిర్ణయం తీసుకోవడంపై పెద్ద చర్చే జరుగుతోంది. విదేశీ టెక్నాలజీ కంపెనీలు రష్యన్ చట్టాలను పాటించాలి లేదా మార్కెట్ నుండి వైదొలగాలి అని రష్యా ప్రభుత్వం స్పష్టం చేసింది. అధికారులు తమ సేవను పూర్తిగా నిలిపివేయడానికి ప్రయత్నిస్తున్నారని వాట్సాప్ గతంలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ప్రజలను ప్రభుత్వ యాజమాన్యంలోని నిఘా యాప్ వైపు మళ్లించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు రష్యన్ ప్రభుత్వం వాట్సాప్ ను పూర్తిగా బ్లాక్ చేయడానికి ప్రయత్నించింది అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.













