Delhi: అమెరికాతో ఒప్పందం వల్ల కలిగే లాభాలేంటి…?
అగ్రరాజ్యం అమెరికాతో ఒప్పందంపై భారత దేశంలోని పలువర్గాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు చూస్తే అమెరికా నుంచి పెద్దఎత్తున వచ్చిపడే సరుకులతో భారతదేశ వెన్నెముక లాంటి వ్యవసాయం కడగండ్ల పాలవుతుందని రైతు సంఘ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు పాడి ఉత్పత్తులు డంపింగ్ అవ్వడం వల్ల ఇక్కడి రైతులు నాశనమవుతారని నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనివల్లే నష్టమేనా ..? లాభం లేదా అంటే ఇందులోనూ పలులాభాలున్నట్లు అర్థమవుతుంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ ల కారణంగా మొత్తం సుంకాలు 50 శాతానికి చేరుకోవడంతో ఇప్పటివరకూ భారత్కు ఇబ్బందులు ఎదురయ్యాయి. భారత ఎగుమతిదారులు నష్టాలు చవిచూశారు.
చాలావరకూ షిప్స్ లో ఉన్న భారతీయ గూడ్స్ ను ఏం చేయాలో తోచని స్థితిలో దిగుమతి దారులు సైతం పడిపోయారు. ఇక ఎగుమతి చేస్తున్న భారతీయ కంపెనీలు, వర్తకులు, రైతులు అయితే.. డిమాండ్ తగ్గి, ఉత్పత్తులకు విలువ పడిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు . దీనికి పరిష్కారమే ఈ మధ్యంతర ఒప్పందమని చెప్పవచ్చు.
నిజానికి భారత ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్ అమెరికా. మధ్యంతర ఒప్పందంతో మొత్తం సుంకాలు ఏకంగా 18 శాతానికి దిగిరావడం భారీ ఊరటగా చెప్పుకోవచ్చు. భారత్ నుంచి వ్రస్తాలు, తోలు ఉత్పత్తులు, చెప్పులు, ప్లాస్టిక్, రబ్బర్, ఆర్గానిక్ రసాయనాలు, ఇంటి అలంకరణ సామగ్రి, కొన్ని రకాల యంత్రాలు, హస్త కళాకృతుల ఎగుమతులు ఊపందుకోనున్నాయి. భారత జనరిక్ ఫార్మాస్యూటికల్స్, రత్నాలు, వజ్రాలపై టారిఫ్లను రద్దు చేస్తామని అమెరికా తెలియజేసింది. దీనిలో భాగంగా 44 బిలియన్ డాలర్ల ఎగుమతులపై సున్నా సుంకాలు అమలు కానున్నాయి.లేబర్ ఇంటెన్సివ్ రంగాలకు సంబంధించిన వ్రస్తాలు, తోలు, పాదరక్షలు, హస్త కళాకృతుల ఎగుమతులకు మరింత ప్రోత్సాహం లభించనుంది.
ఈ ఒప్పందం వల్ల 30 ట్రిలియన్ డాలర్ల అమెరికా మార్కెట్ మనకు అందుబాటులోకి రానుంది. ఫలితంగా యువత, మహిళలు, నిపుణులకు అద్భుతమైన అవకాశాలు దరిచేరనున్నాయి. దేశంలో కొత్తగా లక్షలాది ఉద్యోగాల కల్పన జరగనుంది. మన రైతులు, మత్స్యకారుల ఉత్పత్తులకు మంచి ధరలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.. వస్త్రాలు, వజ్రాలు, రత్నాలు, యంత్ర విడిభాగాలు, బొమ్మలు, తోలు, పాదరక్షలు, హోమ్ డెకార్, స్మార్ట్ ఫోన్ల పరిశ్రమల వృద్ధికి చక్కటి అవకాశాలు ఉన్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.
2030 నాటికి అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. మన జనరిక్ ఫార్మాస్యూటికల్స్, ఎయిర్క్రాఫ్ట్, ఆటో విడిభాగాలకు సైతం జీరో టారిఫ్ వర్తించనుంది. అదే సమయంలో అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులపై మనం సుంకాలు రద్దు చేయడం గానీ, తగ్గించడం గానీ చేయడం లేదని కేంద్రమంత్రి పియూష్ గోయల్ తెలిపారు. మన రైతాంగం ప్రయోజనాలు కాపాడేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. మొత్తానికి మధ్యంతర ఒప్పందం వల్ల ‘మేక్ ఇన్ ఇండియా’కు మరింత ఊపు రానుందని చెప్పవచ్చు.













