Rahul Gandhi: రాహుల్ గాంధీపై నిషేధం విధించాలి.. లోక్సభలో బీజేపీ తీర్మానం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వేళ ఢిల్లీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని (Rahul Gandhi) లక్ష్యంగా చేసుకుని అధికార బీజేపీ పదునైన అస్త్రాలను సంధిస్తోంది. రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని తక్షణం రద్దు చేయడంతో పాటు, ఆయన భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే గురువారం ‘సబ్స్టాంటివ్ మోషన్’ (Substantive Motion) నోటీసు ఇవ్వడం కలకలం రేపింది. రాహుల్ గాంధీ అనైతికంగా ప్రవర్తిస్తున్నారని, విదేశీ పర్యటనల సమయంలో కనీసం ఎంబసీకి సమాచారం ఇవ్వకుండా, సెక్యూరిటీ లేకుండా వెళ్తున్నారని దూబే ఆరోపించారు. ప్రభుత్వాలను కూలదోసే చరిత్ర ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫోర్డ్ సంస్థతో రాహుల్ (Rahul Gandhi) భేటీ అయ్యారని, దేశ వ్యతిరేక శక్తులతో ఆయన చేతులు కలిపారని తీవ్ర విమర్శలు చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మరోవైపు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా రాహుల్ తీరుపై మండిపడ్డారు. రాహుల్ సభను తప్పుదోవ పట్టించారని, స్పీకర్ ఛాంబర్లోకి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. అయితే ప్రభుత్వం అధికారికంగా చర్యలు తీసుకోకముందే, రాహుల్ (Rahul Gandhi) ప్రసంగంలోని కొన్ని అభ్యంతరకర వాక్యాలను లోక్సభ రికార్డుల నుంచి తొలగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరిణామాలపై రాహుల్ గాంధీ అంతే దీటుగా స్పందించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా, ఎలాంటి తీర్మానాలు ప్రవేశపెట్టినా భయపడేది లేదని తేల్చిచెప్పారు. వివాదాస్పద యూఎస్ ట్రేడ్ డీల్ (US Trade Deal) భారత రైతాంగానికి ఉరితాడులా మారుతుందని, అందుకే తాను రైతుల పక్షాన రాజీలేని పోరాటం చేస్తున్నానని స్పష్టం చేశారు. ప్రభుత్వ బెదిరింపులకు లొంగనని చెబుతూ, మల్లికార్జున ఖర్గేతో కలిసి పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపి, భారత్ బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.













