Chandrayan-4: ముహూర్తం ఫిక్స్.. ‘మాన్స్ మౌటెన్’లో దిగనున్న ల్యాండర్
చంద్రయాన్-3 అద్భుత విజయంతో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. ఇప్పుడు అంతకంటే అత్యంత సంక్లిష్టమైన ‘చంద్రయాన్-4’ (Chandrayan-4) ప్రయోగానికి సన్నాహాలు ముమ్మరం చేసింది. జాబిల్లిపైకి వ్యోమనౌకను పంపి, అక్కడి నుంచి మట్టి, రాతి నమూనాలను సురక్షితంగా భూమికి తీసుకురావడమే లక్ష్యంగా చేపడుతున్న ఈ ప్రతిష్టాత్మక మిషన్ ల్యాండింగ్ సైట్‌ను ఇస్రో తాజాగా ఖరారు చేసింది. చంద్రుడి దక్షిణ ధ్రువంలోని అత్యంత ఎత్తయిన, సురక్షితమైన ‘మాన్స్ మౌటన్’ (Mons Mouton) పర్వత ప్రాంతాన్ని ల్యాండింగ్ కోసం ఎంపిక చేశారు. 2028లో ప్రయోగించనున్న ఈ మిషన్ కోసం.. గతంలో ప్రయోగించిన చంద్రయాన్-2 ఆర్బిటర్ కెమెరా (OHRC) అందించిన హై-రిజల్యూషన్ చిత్రాలను విశ్లేషించి శాస్త్రవేత్తలు ఈ నిర్ణయానికి వచ్చారు.
మాన్స్ మౌటన్ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఎంఎం-1, ఎంఎం-3, ఎంఎం-4, ఎంఎం-5 అనే నాలుగు ప్రదేశాలను ఇస్రో నిశితంగా పరిశీలించింది. ఇందులో ‘ఎంఎం-4’ (MM-4) ప్రాంతం (Chandrayan-4) ల్యాండింగ్‌కు అత్యంత అనుకూలమైనదిగా, సురక్షితమైనదిగా తేల్చింది. సముద్ర మట్టానికి సగటున 5,334 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశంలో నేల వాలు (స్లోప్) కేవలం 5 డిగ్రీలు మాత్రమే ఉండటం ల్యాండర్ స్థిరత్వానికి బాగా కలిసిరానుంది. ఒక కిలోమీటరు విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలో ప్రమాదకరమైన భారీ గుంతలు, పెద్ద రాళ్లు చాలా తక్కువగా ఉన్నాయని ఇస్రో వర్గాలు వెల్లడించాయి. సాఫ్ట్ ల్యాండింగ్‌కు అవసరమైన 24×24 మీటర్ల సురక్షిత గ్రిడ్లు ఇక్కడ అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే సూర్యరశ్మి కూడా నిరంతరాయంగా 11 నుంచి 12 రోజుల పాటు ఈ ప్రాంతంలో లభిస్తుంది.
భారత్ ఇప్పటివరకు చేపట్టిన అంతరిక్ష ప్రయోగాల్లో చంద్రయాన్-4 (Chandrayan-4) అత్యంత కీలకమైన, కఠినమైన మిషన్ కానుంది. ఈ వ్యోమనౌకలో ప్రొపల్షన్, డిసెండర్, అసెండర్, ట్రాన్స్ఫర్, రీ-ఎంట్రీ అనే ఐదు ప్రత్యేక మాడ్యూల్స్ ఉంటాయి. ఇందులో డిసెండర్, అసెండర్ మాడ్యూల్స్ మాత్రమే అనుకున్న మాన్స్ మౌటన్ ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండ్ అవుతాయి. అక్కడ చంద్రుడి నమూనాలను రోబోటిక్ పరిజ్ఞానంతో సేకరించిన తర్వాత, అసెండర్ మాడ్యూల్ అక్కడినుంచే తిరిగి పైకి లేచి నమూనాలతో భూమి కక్ష్యలోకి చేరుకుంటుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే, చంద్రుడి దక్షిణ ధ్రువం నుంచి నమూనాలను భూమికి తీసుకొచ్చిన ఏకైక దేశంగా భారత్ చరిత్రలో నిలిచిపోతుంది.













