Mass Copying: పరీక్షల్లో మాస్ కాపీయింగ్.. డ్రోన్ కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన టీచర్లు!
పరీక్షల్లో కాపీయింగ్‌ను అరికట్టాల్సిన ఉపాధ్యాయులే స్వయంగా విద్యార్థులకు సహాయం చేస్తూ (Mass Copying) పట్టుబడిన ఘటన మహారాష్ట్రలో సంచలనం సృష్టిస్తోంది. బీడ్ జిల్లాలోని ఒక పాఠశాలలో జరిగిన 12వ తరగతి బోర్డు పరీక్షల సందర్భంగా ఈ విస్తుపోయే నిజం బయటపడింది. సాధారణంగా ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు ఉంటాయని భావించిన అక్కడి సిబ్బందికి, విద్యాశాఖ పంపిన ‘డ్రోన్ కెమెరా’ చుక్కలు చూపించింది. ఈ డ్రోన్ తీసిన విజువల్స్ ఆధారంగా ఏకంగా 17 మంది ఉపాధ్యాయులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి
అసలు ఏం జరిగిందంటే.. బీడ్ జిల్లాలోని ధరావతి విద్యా మందిర్ పరీక్షా కేంద్రంలో భారీ ఎత్తున కాపీయింగ్ (Mass Copying) జరుగుతోందని అధికారులకు ముందే సమాచారం అందింది. దీంతో అధికారులు నేరుగా వెళ్లకుండా, రహస్యంగా ఒక డ్రోన్ కెమెరాను రంగంలోకి దించారు. ఆ డ్రోన్ పాఠశాల కిటికీల గుండా లోపలికి చూసినప్పుడు అసలు దృశ్యం వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వయంగా చిట్టీలు అందించడం, బోర్డుపై సమాధానాలు రాయడం వంటి దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. ఉపాధ్యాయులతో పాటు కొందరు బయటి వ్యక్తులు కూడా పాఠశాల ప్రహరీ గోడలు ఎక్కి మరీ విద్యార్థులకు సహకరిస్తున్నట్లు డ్రోన్ ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది.
ఈ ఆధారాలను (Mass Copying) చూసి షాక్ తిన్న విద్యాశాఖ అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాపీయింగ్‌కు సహకరించిన ఆ 17 మంది ఉపాధ్యాయులపై ఐపిసి సెక్షన్లతో పాటు మహారాష్ట్ర మాల్ ప్రాక్టీస్ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. విద్యా వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ప్రవర్తించిన వీరిని విధుల నుంచి తొలగించే ప్రక్రియ కూడా మొదలైంది. సాంకేతికతను ఉపయోగించి కాపీయింగ్ మాఫియా గుట్టు రట్టు చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భవిష్యత్తులో అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఇలాంటి నిఘా పెట్టాలని విద్యాశాఖ యోచిస్తోంది.
ఇవి కూడా చదవండి













