Chandrababu: ఎమ్మెల్యేకి చంద్రబాబు వార్నింగ్.. అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం..!
గత ఆరు నెలలుగా టిడిపి ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాస్(Kolikapudi) వ్యవహారం పార్టీ అధిష్టానానికి ఇబ్బందికరంగా మారింది. ఆయన ఎప్పుడు ఏం విమర్శలు చేస్తారో అర్థం కాక పార్టీ నేతలు కంగారుపడుతున్నారు. అటు దశాబ్దాల తర్వాత నియోజకవర్గంలో టిడిపి(TDP) విజయం సాధించినప్పటికీ, కార్యకర్తల్లో సంతోషం మాత్రం కనబడటం లేదని చెప్పాలి. ఎమ్మెల్యేకి, ఎంపీ కి ఉన్న విభేదాలు పార్టీని బలహీన పరుస్తున్నాయనే ఆవేదన చాలావరకు వ్యక్తం అవుతుంది.
రాజకీయంగా కూడా పార్టీని… నియోజకవర్గంలో బలోపేతం చేయడం మానేసి, విభేదాలతో ఇబ్బంది పెడుతున్నారనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. ఇక కొలికపూడి శ్రీనివాసరావుతో పాటుగా విజయవాడ ఎంపీ కేసినేని చిన్నికి ఎన్నిసార్లు హెచ్చరికలు పంపినా సరే, వారి వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు అనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే చిన్ని కాస్త సైలెంట్ కావడంతో వివాదం సద్దుమణిగినట్లుగానే కనబడింది. అయితే కొలికపూడి శ్రీనివాసరావు దూకుడు వైఖరి ఆందోళన కలిగిస్తుంది.
దీనితో సీఎం చంద్రబాబుతో పాటుగా టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తాజాగా కొలికపూడిని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజున ఎమ్మెల్యేతో పల్లా శ్రీనివాసరావు భేటీ కాగా నేడు సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏదైనా సమస్య ఉంటే రాష్ట్ర అధ్యక్షుడు దృష్టికి తీసుకువెళ్లాలని, అంతేగాని పార్టీ లైన్ దాటవద్దని హెచ్చరించారు. నియోజకవర్గ సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని మంత్రులు కూడా అందుబాటులో ఉంటారని.. బహిరంగంగా విమర్శలు చేయవద్దని తెలిపినట్లు తెలుస్తోంది.













