Chityala: చిట్యాల గడ్డపై సరికొత్త చరిత్ర.. కౌన్సిలర్‌గా ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్!
Chityala: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఒక అరుదైన, స్ఫూర్తిదాయకమైన విజయం నమోదైంది. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో సామాజిక అడ్డంకులను అధిగమించి ఓ ట్రాన్స్‌జెండర్ ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించారు.
చారిత్రాత్మక గెలుపు:
చిట్యాల మున్సిపాలిటీలోని 1వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నాగిళ్ల కావేరి సుధాకర్ (ట్రాన్స్‌జెండర్) కౌన్సిలర్‌గా విజయం సాధించారు. బలమైన రాజకీయ పార్టీల అభ్యర్థులను ఎదుర్కొని ఆమె ఈ ఘనత సాధించడం విశేషం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సీపీఎం (CPM) అభ్యర్థి నగేశ్‌పై కావేరి సుధాకర్ 109 ఓట్ల మెజారిటీతో జయకేతనం ఎగురవేశారు.
ఇవి కూడా చదవండి
తెలంగాణలోనే మొదటిసారి:
మున్సిపల్ ఎన్నికల చరిత్రలో ఒక ట్రాన్స్‌జెండర్ కౌన్సిలర్‌గా గెలవడం తెలంగాణ రాష్ట్రంలో ఇదే తొలిసారి. కేవలం సామాజిక గుర్తింపు కోసమే కాకుండా, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఎన్నికల్లో నిలబడిన కావేరి సుధాకర్‌ను వార్డు ప్రజలు హృదయపూర్వకగా ఆదరించారు. పార్టీల కంటే వ్యక్తిత్వానికే పట్టం కడుతూ ఓటర్లు ఆమెకు ఓటు వేశారు.
వెల్లువెత్తుతున్న అభినందనలు:
ఈ విజయం వెలువడగానే చిట్యాలలో సంబరాలు మిన్నంటాయి. తోటి ట్రాన్స్జెండర్లు, స్థానిక ప్రజలు కావేరి సుధాకర్‌ను పూలమాలలతో ముంచెత్తారు. “ఈ గెలుపు మా సామాజిక వర్గానికి దక్కిన గౌరవం.. నాపై నమ్మకం ఉంచిన వార్డు ప్రజలకు రుణపడి ఉంటాను” అని కావేరి సుధాకర్ ఈ సందర్భంగా భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. సామాజిక వర్గాలకు అతీతంగా ఆమెకు రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.













