Pawan Kalyan: ఏపీ అసెంబ్లీలో పవన్, బాలయ్య ఆసక్తికర భేటీ..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (Andhra Pradesh Assembly) సమావేశాల సందర్భంగా ఒక ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రత్యేకంగా కలిసి మాట్లాడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ ఛాంబర్‌కు నేరుగా వెళ్లిన బాలకృష్ణ కొంతసేపు ఆయనతో ముఖాముఖి చర్చలు జరిపారు. ఇటీవల కాలంలో ఈ ఇద్దరు నాయకులు ఇలా కూర్చొని మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
ఇంతకు ముందు వీరిద్దరూ ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable) కార్యక్రమం సమయంలో ఒక వేదికపై కనిపించారు. అధికారిక కార్యక్రమాల్లో ఎదురుపడినప్పుడు పలకరించుకున్న సందర్భాలు ఉన్నా, ఈ తరహా ప్రత్యేక భేటీ మాత్రం జరగలేదు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో హిందూపురం నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి అంశాలు, స్థానిక సమస్యలు , తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సమావేశం సాధారణ మర్యాదపూర్వక భేటీ కాదని, ప్రాధాన్యమైన అంశాలపై చర్చ జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ సందర్భంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కూడా పవన్ కళ్యాణ్‌ను కలిసి మాట్లాడారు. అదేవిధంగా ఎమ్మెల్సీ నాగబాబు (Nagababu) ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అసెంబ్లీ లాబీల్లోనూ, పవన్ కార్యాలయంలోనూ జరిగిన ఈ భేటీలు ఆసక్తిని రేకెత్తించాయి. నాగబాబు శాసనమండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై, ప్రజా సమస్యలను ఎలా ప్రస్తావించాలన్న దానిపై చర్చించినట్టు తెలుస్తోంది. జనసేన (Jana Sena Party) తరఫున ప్రజల సమస్యలను బలంగా వినిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇచ్చినట్టు సమాచారం.
ఇదే సమయంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి (Ashok Reddy) సహా పలువురు ఎమ్మెల్సీలు కూడా పవన్ కళ్యాణ్‌ను కలిసి తమ నియోజకవర్గాల సమస్యలను వివరించారు. ముఖ్యంగా రహదారుల అభివృద్ధి, తాగునీటి కొరత, మౌలిక వసతుల లోపాలపై వినతి పత్రాలు అందజేశారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని వారు కోరినట్టు తెలిసింది. పవన్ కూడా ఈ అంశాలను గమనించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు సమాచారం.
మొత్తంగా అసెంబ్లీ సమావేశాల మధ్య జరిగిన ఈ వరుస భేటీలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచాయి. భవిష్యత్‌లో సమన్వయంతో పనిచేసే దిశగా ఈ సమావేశాలు ఒక సంకేతంగా భావిస్తున్నారు. అధికార వర్గాల్లోనూ, ప్రతిపక్ష శ్రేణుల్లోనూ ఈ పరిణామాలపై చర్చ కొనసాగుతోంది.













