Vaddepalli : తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత సంచలనం.. వడ్డేపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ని దాటి…
Vaddepalli: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ వేదికగా ఒక అరుదైన రాజకీయ సంచలనం నమోదైంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్లకు షాక్ ఇస్తూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) పార్టీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్లి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక్కడ మొత్తం 10 వార్డులకు గాను ఏకంగా 8 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు ఘనవిజయం సాధించగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో ఒక స్థానానికి పరిమితమయ్యాయి.
ఇవి కూడా చదవండి
తెర వెనుక కవిత వ్యూహం?
ఈ విజయం వెనుక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యూహం స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వడ్డేపల్లిలో బలమైన నేతగా పేరున్న వడ్డేపల్లి శ్రీనన్న కొద్ది రోజుల క్రితమే కవిత సారథ్యంలోని ‘తెలంగాణ జాగృతి’లో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా జాగృతి నేతలు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన ‘సింహం’ గుర్తుపై పోటీ చేయాలని నిర్ణయించగా, వడ్డేపల్లిలో శ్రీనన్న మద్దతుదారులు అదే గుర్తుపై బరిలోకి దిగారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో వారు సంచలన విజయం సాధించడంతో, ఈ గెలుపు కవిత రాజకీయ సత్తాకు నిదర్శనమని ఆమె మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు.
ప్రధాన పార్టీలకు పరాభవం:
అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలు వడ్డేపల్లిలో ఆశించిన ప్రభావం చూపలేకపోయాయి. కేవలం ఒక్కో సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సామాన్య ప్రజల్లో శ్రీనన్నకు ఉన్న పట్టు, జాగృతి శ్రేణుల సమన్వయం ఈ విజయానికి బాటలు వేశాయని స్థానికులు పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఈ ‘సింహం’ గుర్తు మరిన్ని మలుపులకు కారణమయ్యేలా కనిపిస్తోంది.













