Tollywood: టాలీవుడ్ లో సమ్మె తప్పదా?
తెలుగు సినీ పరిశ్రమ మరోసారి షట్‌డౌన్ దిశగా వెళ్తుందనే డిస్కషన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే కొన్ని అసోసియేషన్లు తమ డిమాండ్లపై గట్టిగా నిలబడి, ఈ నెలాఖరిలోపు సాల్వ్ అవకపోతే, సమ్మెకు దిగుతామని అల్టిమేటం జారీ చేయడంతో ఈ సమస్య వచ్చింది. తెలుగు టెలివిజన్, సినిమా కార్మిక సంఘాలకు చెందిన ప్రొడక్షన్ అసిస్టెంట్స్, సెట్ అసిస్టెంట్ల అసోసియేషన్లు ముందుగా ఈ హెచ్చరికలు చేయడంతో సమస్య మొదలైంది.
వారితో పాటు మరో 11 కార్మిక సంఘాలు కూడా ఇదే దారిలో వెళ్తుండటంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. వేతనాల పెంపు, పని గంటల నియంత్రణ, భద్రతా చర్యలు, సంక్షేమ పథకాలు లాంటి వాటిపై చాలాకాలంగా చర్చలు జరుగుతున్నప్పటికీ క్లియర్ డెసిషన్స్ తీసుకోకపోవడంపై కార్మిక వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇండస్ట్రీకి చెందిన పలువురు హామీలు ఇచ్చినా, అవి అమల్లోకి రాకపోవడంతో సమ్మె తప్పదనే భావన బలపడుతోంది.
ఒకవేళ నిజంగానే సమ్మె జరిగితే, షూటింగ్ దశలో ఉన్న సినిమాలు, షూటింగ్ జరుపుకుంటున్న పలు ప్రాజెక్టులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. దీని ప్రభావం చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ చిత్రాల వరకు ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. వాటితో పాటూ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసిన సినిమాలకు కూడా ఆర్థిక నష్టం భారీగా ఉండే అవకాశం ఉంది. అందుకే రెండు వర్గాలు చర్చల ద్వారా సమస్యలను సాల్వ్ చేసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.













