Modi: బీఎన్పీ నేత రహ్మాన్ కు మోడీ శుభాకాంక్షలు..
బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన బీఎన్పీ అధినేత తారిఖ్ రహ్మాన్ కు భారత ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లా (Bangladesh)లో ప్రజాస్వామ్యయుత ప్రభుత్వానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని మోడీ (PM Modi) హామీ ఇచ్చారు.
‘‘బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో (Bangladesh Elections) బీఎన్పీని ఘన విజయం దిశగా నడిపించిన తారిఖ్ రహ్మాన్ (Tarique Rahman)కు అభినందనలు. మీ నాయకత్వంపై బంగ్లా ప్రజల విశ్వాసానికి ఈ గెలుపు నిదర్శనం. ప్రజాస్వామ్య, ప్రగతిశీల సమ్మిళిత బంగ్లాదేశ్‌కు భారత్ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుంది. ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతం, ఉమ్మడి లక్ష్యాలపై ముందుకువెళ్లేందుకు మీతో (తారిఖ్ నేతృత్వంలోని ప్రభుత్వం) కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాం’’ అని ప్రధాని మోడీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
299 పార్లమెంట్ స్థానాలు ఉన్న బంగ్లాదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే 150 మంది సభ్యుల సంఖ్యాబలం అవసరం. తాజా ఎన్నికల ఫలితాల్లో 212 స్థానాల్లో విజయం సాధించినట్లు బీఎన్పీ ప్రకటించింది. 70 సీట్లకు పరిమితమైన జమాత్-ఏ-ఇస్లామీ పార్టీ ఓటమిని అంగీకరించింది. బీఎన్పీ నాయకుడు తారిఖ్ రహ్మాన్ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అవినీతి కేసుల నేపథ్యంలో 17 ఏళ్ల క్రితం దేశం నుంచి వెళ్లిపోయిన రహ్మాన్ ఇటీవలే బంగ్లాదేశ్‌కు తిరిగొచ్చారు. తల్లి ఖలీదా జియా మరణంతో పార్టీ పగ్గాలను అందుకున్న ఆయన.. తాజా ఎన్నికల్లో బీఎన్పీని విజయం దిశగా నడిపించారు. దీంతో రెండు దశాబ్దాల తర్వాత ఈ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది.
బీఎన్పీ విజయంతో భారత్-బంగ్లా సంబంధాలు మళ్లీ గాడిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి బీఎన్పీతో భారత్ సంబంధాలు ఎన్నో ఆటుపోట్లను చవిచూశాయి. అయితే హసీనా పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోవడంతో బీఎన్పీతో సానుకూల సంబంధాలపై మోడీ సర్కార్ ఫోకస్ పెట్టింది. రహ్మాన్ ప్రభుత్వానికి సైతం దేశాన్ని సజావుగా ముందుకు నడిపించాలంటే.. భారత్ అండ కావాల్సిందే. దీంతో ఇరుదేశాలు కలిసికట్టుగా పనిచేేసే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి













